ఎసిడిటీ సమస్య సాధారణంగా ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండే వారికి వస్తుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, కొరవడిన వ్యాయామం, మానసిక ఒత్తిళ్లు కూడా ఎసిడిటీ సమస్యకు కారణమవుతున్నాయి. ఎప్పుడూ ఆయాసంగా అనిపించడం, తేన్పులు రావడం, కడుపు ఉబ్బరంగా అనిపించటం లాంటి సమస్యలన్నీ ఎసిడిటీ వలన కలిగే బాధలే. కడుపులో ఆసిడ్ ఎక్కువగా విడుదల కావడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. 
 
కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా ఎసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక అరటిపండు తినటం వలన ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. నిత్యం బెల్లం, బాదంపప్పులు తినటం, రోజుకు మూడు నాలుగుసార్లు కొబ్బరి నీళ్లను తాగటం, తులసి ఆకులను నిత్యం చప్పరించటం వలన ఎసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. 
 
ఎసిడిటీతో బాధ పడేవారు భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలా, దినుసులతో తయారైన ఆహారానికి దూరంగా ఉండటంతో పాటు వేపుడు పదార్థాలను తగ్గించటం మంచిది. యోగా, మెడిటేషన్ చేస్తే మానసిక ఒత్తిళ్లు తగ్గి ఎసిడిటీ సమస్య తగ్గుముఖం పడుతుంది. ద్రాక్ష పండ్లను తినటం ద్వారా, నిమ్మకాయ రసాన్ని తాగటం ద్వారా కూడా ఎసిడిటీ సమస్య నుండి తక్షణమే ఉపశమనం పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: