దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 271 కేసులు నమోదుకావ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం ఒక్క‌రోజే దాదాపు 38 కొత్త కేసులు న‌మోదు కావ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. తాజాగా మహారాష్ట్రలో 11 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.  దీంతో ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 63కు చేరింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మ‌హారాష్ట్ర క‌రోనా పాజిటివ్ కేసుల్లో టాప్ ప్లేసులో కొన‌సాగుతోంది. ఇక ఆ త‌ర్వాత హైద‌రాబాద్ విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంది. శ‌నివారం సాయంత్రం  హైద‌రాబాద్‌లో స్టేజి-2కు సంబంధించిన పీ-14 కేసు న‌మోదు కావ‌డం భ‌యాందోళ‌న‌ల‌ను రేకెత్తిస్తోంది.  

 

ఇటీవ‌ల‌ రైల్లో ప్రయాణించిన 12 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు రైల్వే శాఖ బాంబు పేల్చింది. మార్చి 13న ఢిల్లీ నుంచి రామగుండానికి ఏపీ సంపర్క్ క్రాంతి రైలులో పర్యటించిన ఎనిమిదికి, మార్చి 16న గొడాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ముంబయి నుంచి జబల్‌పూర్ వెళ్లిన నలుగురు ప్రయాణికులకు వైరస్ సోకినట్టు తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు రైల్లో దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.  మరోవైపు, పుణేకు చెందిన ఓ మహిళకు వైరస్ సోకగా.. ఆమె విదేశాల్లో పర్యటించిన హిస్టరీ లేదని అధికారులు వెల్లడించారు.

 

 ఇదిలా ఉండ‌గా  తెలుగు రాష్ట్రాల్లో అనుమానితల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఆలయాలను మూసివేశారు. కరోనా ప్రభావంపై ఏపీ ప్రభుత్వం తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఇక దేశ వ్యాప్తంగా న‌మోదైన 271 కేసుల్లో 39 మంది విదేశీయులు కూడా ఉన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 11,420 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గతంలో ఆఫ్రికా దేశాల్లో వెలుగుచూసిన ఎబోలా వైరస్ మరణాలను కరోనా మృతులను దాటేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి ప్రజలు సహకరించాలని, ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: