కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. శ‌నివారం రాత్రి  కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ క‌రోనా పాజిటివ్ కేసుల‌కు సంబంధించిన గ‌ణాంకాల‌ను వెల్ల‌డించింది.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 283 కేసులు న‌మోదైన‌ట్లుగా అధికారిక వెబ్‌సైట్‌లో వివ‌రాలు పెట్టింది.వాస్త‌వానికి కరోనా కేసులు శనివారం ఉదయం 258 నమోదు కాగా, వీరిలో 39 మంది విదేశీయులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 55 కరోనా కేసులు  నమోదు కావడం విస్మయం కలిగించే అంశం.

 

 ఇక తెలంగాణ‌లో, మ‌హ‌రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున వైర‌స్ స్టేజ్‌-2కు సంబంధించిన కేసులు న‌మోదుకావడంతో  దేశం ఉలిక్కిప‌డుతోంది. మరోవైపు, తెలంగాణలో కరోనా కేసులు 21గా నమోదయ్యాయి. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొత్తం కరోనా కేసులు 21గా ప్రకటించారు. అయితే, వీటిలో రాష్ట్రంలోనే కరోనా వ్యాప్తి చెందిన తొలి కేసు నమోదు కావడం గమనార్హం. 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దుబాయి నుంచి వచ్చిన ఓ యువకుడి ద్వారా 35 ఏళ్ల మరో వ్యక్తికి రాష్ట్రంలోనే కరోనా సోకింద‌ని వైద్య అధికారిక వ‌ర్గాలు ధ్రువీక‌రించాయి. 

 


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌‌ను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 24 మంది రక్త నమూనాల కోసం వేచి చూస్తున్నట్లుగా వైద్యులు ప్రకటించారు. కరోనా వైరస్ పరీక్షల కోసం దేశ వ్యాప్తంగా 112 పరిశోధనశాలలు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ అగర్వాల్‌ వెల్లడించారు.  మరోవైపు, కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా జ‌న‌తా క‌ర్ఫ్యూను పాటించాల‌ని ప్ర‌ధాని మోదీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు. ప్ర‌తీ ఒక్క‌రూ బాధ్య‌తాయుతంగా మెద‌లాల‌ని ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పిలుపునిచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: