హైద‌రాబాద్ నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్‌లో క‌రోనా అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో రైల్లో ప్ర‌యాణిస్తున్న రైల్వే పోలీసులు వెంట‌నే అదుపులోకి తీసుకుని వెంట‌నే గాంధీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనుమానితుడి చేతికి ఉన్న స్టాంప్‌ ఆధారంగా ప్రయాణికుడికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించిన‌ట్లు రైల్వే అధికారులు వెల్ల‌డిస్తున్నారు. అనుమానితుడు ముంబై ఎక్స్ ప్రెస్లో ముంబై నుంచి హైదరాబాద్ వ‌ర‌కు ఏసీ బోగీలో ప్ర‌యాణించిన‌ట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే వ్య‌క్తిగ‌త వివ‌రాలేమీ అనుమానితుడు వెల్ల‌డించ‌క‌పోవ‌డం అధికారుల్లో మ‌రిన్ని అనుమానాల‌ను పెంచుతోంది. 

 

అత‌డు మ‌నదేశం వాడా కాదా అన్న‌ది కూడా అనుమానంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు రెండు కోణాల్లోనూ పోలీసుల‌కు స‌వాల్‌గా మారింది. ఇప్పుడు అత‌నితో పాటు ఏసీ బోగీలో ప్ర‌యాణించిన వారి వివ‌రాలు క‌నుక్కునే ప‌నిలో అధికారులున్నారు. వారంద‌రికీ త్వ‌రిత‌గ‌తిన ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా రోజురోజుకు ప్రభావం పెంచుకుంటూ.. కరోనా వైరస్ తెలుగు ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 

నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా బాధితులు ఉండగా.. లేటెస్ట్‌గా రాజమహేంద్రవరం, విజయవాడల్లో ఒక్కొక్కరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరుకున్న‌ట్లుగా తాజా గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. నలుగురు చనిపోయారు. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 63 కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: