ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న హైద‌రాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేష‌న్ బోసిపోతోంది. కేంద్ర ప్ర‌భుత్వం  రైల్వే స‌ర్వీసులను దాదాపు పూర్తిగా ర‌ద్దు చేయ‌డంతో కాచిగూడ రైలు కూత వినిపించ‌డం లేదు. నిత్యం వేలాదిమంది ప్రయాణికులతో కిటకిటలాడే కాచిగూడ రైల్వేస్టేషన్ ప్ర‌స్తుతం నిర్మానుష్యంగా మారింది. ఆదివారం ఈ స్టేషన్‌ నుంచి బయలుదేరాల్సిన అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దుచేసింది. కాచిగూడ రైల్వేస్టేషన్‌ ప్రధాన గేట్లను, బుకింగ్‌ కౌంటర్లు, రిజర్వేషన్‌ కౌంటర్లను పూర్తిగా మూసివేయ‌డం గ‌మ‌నార్హం. జ‌న‌తా కర్ఫ్యూలో భాగంగా ప్ర‌జ‌లెవ‌రూ కూడా ఇళ్ల‌ను బ‌య‌ట‌కు రాకుండా స్వ‌చ్ఛందంగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

 

అయితే  కర్ణాటక సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ మినహా ఏ ఒక్క రైలు కూడా ఈ స్టేషన్‌ మీదుగా స‌ర్వీసును కొన‌సాగించ‌లేదు. కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వచ్చే చెన్నై-చెంగల్పట్టు, వెంకటాద్రి, మైసూర్‌, బెంగళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు యథావిధిగా ఆదివారం ఉదయం చేరుకున్నాయి. ఇక ఆ త‌ర్వాత ఒక్క రైలు కూడా తిర‌గాడ‌లేదు. రైల్వేస్టేష‌న్‌లో  పోలీసులు మినహా ఒక్క ప్రయాణికుడు కూడా కాన‌రాలేదు. 103ఏళ్ల కాచిగూడ రైల్వేస్టేషన్‌ చరిత్రలో ఈ పరిస్థితి ఎన్నడూలేదని అధికారులు చెప్పారు. బస్సులు, ఆటోలు లేకపోవడంతో ప్రయాణికులు క్యాబ్‌లలో గమ్యస్థానాలకు వెళ్ల‌డం క‌నిపించింది.

 

ఇదిలా ఉండ‌గా దేశంలో గంట‌గంట‌కు పెరుగుతున్న క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే అనేక కొత్త ఆంక్ష‌ల‌ను అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్నాయి. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 19 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా రాత్రి స‌మయానికి ఒక్క‌సారిగి 8 కేసులు పెరిగి 27కు చేరుకుంది. నిన్న ఆదివారం ఒక్కరోజే కొత్తగా  ఎనిమిది కేసులు న‌మోదుకావ‌డంతో తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా, ఒకే కుటుంబంలోని ముగ్గురికి వైరస్ సోకిన‌ట్లు ప‌రీక్ష‌ల్లో నిర్ధార‌ణ కావ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఇక్క‌డి నుంచి ద్వితీయ‌శ్రేణి న‌గ‌రాల‌కు విస్త‌రించ‌కుండా  క‌ట్టడి చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: