క‌రోనా గండం నుంచి ఇక అగ్ర‌రాజ్యం అమెరికా బ‌య‌ట‌ప‌డిన‌ట్లేన‌ని భావిస్తున్న త‌రుణంలో ఆ ర‌క్క‌సి మ‌ళ్లీ క‌బ‌ళిస్తోంది. ఈ సారి వెయ్యి రెట్ల వేగంతో అమెరికాలో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టంతో ప్రాణాలు మాస్కుల్లో పెట్టుకుని బ‌తుకుతున్నారు అక్క‌డి జ‌నం.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే వేలాదిమందికి పాకింది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే పదివేల కొత్త కేసులు నమోదు కావడం ఇందుకు నిద‌ర్శ‌నం.  దీంతో అమెరికా దేశంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. అంతేకాదు నిన్న ఒక్క‌రోజే 130 మంది ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య  622కి పెరిగింది. 

 

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అయితే  కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 16,961గా ఉంది. 4 లక్షల మందికిపైగా క‌రోనా బారిన ప‌డి విల‌విల‌లాడుతున్నారు. క్వారంటైన్‌లో పెడుతున్న ఆయా దేశ ప్ర‌భుత్వాలు జనాల‌ను ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉంచ‌డం క‌ష్ట‌సాధ్యంగా మారుతుండ‌టంతో ఏం చేయాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ప్రపంచం మొత్తం మీద సుమారు 175 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. న్యూయార్క్‌ నగరం, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్‌ ఐలాండ్‌ ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందిలో ఒకరు వ్యాధి బారిన పడ్డారని వైట్‌హౌస్‌లో కరోనా టాస్క్‌ఫోర్స్‌ అధికారి డెబ్రా ఎల్‌ బ్రిక్స్‌ తెలిపారు. 

 

ఇదిలా ఉండ‌గా అమెరికాలో క‌రోనా ఉధృతి పెరుగుతుండ‌గా  మాస్కులు, శానిటైజర్లు ఇతర మందుల కొర‌త ఏర్ప‌డుతోంది. దీనికి తోడు మెడిక‌ల్ దుకాణాల వ్యాపారులు అక్ర‌మంగా నిల్వం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో అధ్య‌క్షుడు ట్రంప్ అలాంటి దుకాణాల లైసెన్స్‌ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని, త‌క్ష‌ణ‌మే షాపులను సీజ్ చేసి అందులోని నిల్వ‌ల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేశారు.  అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసినా శిక్ష తప్పదన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో  ప్రస్తుతం కోవిడ్‌కు కేంద్ర బిందువుగా మారింది. అమెరికాలో కోవిడ్‌ బారిన పడ్డ ప్రతి ఇద్దరిలో ఒక్కరు న్యూయార్క్‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. సోమవారం సుమారు 5085 కొత్త కేసులు నమోదు కావడంతో ఈ మహానగరంలో ఇప్పటివరకూ ఉన్న కేసుల సంఖ్య 20,875కు ఎగబాకింది. న్యూయార్క్‌లో ఇప్పటికే 43 మంది మరణించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: