భద్రాద్రి  కొత్తగూడెం డీఎస్పీ కుటుంబంతో కాంటాక్ట్‌లో ఉన్న 21 మందికి కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో  వారంతా ఊపిరి పీల్చకున్నారు. వీరి ఫ‌లితాల కోసం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోనూ హై టెన్ష‌న్ నెల‌కొంది. క‌రోనా నెగ‌టివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో  ఆ 21 మందిని హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే 21 మందిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల‌ని వైద్యులు ఆదేశించారు.  కొత్త‌గూడెం డీఎస్పీ ఎస్ఎం అలీ, ఆయ‌న కుమారుడు,  వారింట్లో ప‌నిచేసే మ‌హిళ ప‌నిమ‌నిషికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. 

 

కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో స‌ద‌రు డీఎస్పీ  నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. లండన్‌ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ  అయినా క్వారైంటన్‌లో పెట్టకుండా డీఎస్పీ త‌న‌తో ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో అతనిపై 1897 అంటువ్యాధుల నిర్మూ‍లన చట్టం కింద కేసు నమోదైంది. అయితే ఆ త‌ర్వాత రెండు రోజుల‌కు డీఎస్పీతో పాటు ఆయ‌న ఇంట్లో వంట ప‌నిచేసే మ‌హిళ‌కు కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో డీఎస్పీతో పాటు ప‌నిచేసిన దాదాపు 21మంది పోలీస్ సిబ్బందిని కూడా ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించారు. అయితే బుధ‌వారం వ‌చ్చిన ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో వారికి నెగ‌టివ్ రావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

 ఇదిలా ఉండ‌గా డీఎస్పీ కుంటుంబం ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది. అక్క‌డి నుంచి కొంత‌మందిని క్వారంటైన్‌లో ఉంచిన‌ట్లు తెలుస్తోంది. క్వారంటైన్‌లో ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లఘించిన 80 మందిపై 1897 ఎపిడెమిక్‌ డిజీజ్‌ యాక్ట్‌ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి ఇళ్లనుంని బయటికి వచ్చే వారిని ఉపేక్షించొద్దని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: