ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి నుండి తప్పించుకోవడానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండడానికి ముఖ్యంగా ఉపయోగపడేవి మాస్కులు. ఇవి లేకుండా జనం అస్సలు బయటికి రాకూడదని ప్రభుతం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మాస్కులు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ఇక్కడ మాత్రం వాటిని నిల్వ చేసి వ్యాపారం చెయ్యాలని చూస్తున్నారు. ఈ పని జరిగింది ఏ చైనాలోనో, అమెరికాలోనో కాదు, మన ముంబైలోనే.

 

 

భారత దేశంలో అత్యంత ఖరీదైన నగరాలలో ఒకటిగా పేరొందిన ఈ ముంబైలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. పైగా మన దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర రాజధాని ఈ ముంబై. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఈ మహమ్మారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో మహారాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ ముందే కొనుక్కుని పెట్టుకుంటున్నారు. ఇదే అదునుగా చాలా మంది అక్రమంగా తమ వ్యాపారాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.  వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది.

 

 

అందులో భాగంగానే, దేశంలోని లాక్ డౌన్ పరిస్థితి సందర్భంగా నిత్యావసర వస్తువుల నిల్వను అరికట్టడానికి చేసిన దాడులలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముంబై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో మంగళవారం రాత్రి ముంబై సబర్బన్ షా వేర్ హౌసింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ గోడౌన్‌పై దాడి చేసి 200 బాక్సుల ఫేస్ మాస్కులను స్వాధీన పర్చుకున్నారు. అంతకుముందే సోమవారం సాయంత్రం  జరిగిన మరో దాడిలో రూ.15 కోట్ల విలువైన 25 లక్షల మాస్కులను పోలీసులు సీజ్ చేశారు. జనం ప్రాణాలు కాడడం కోసం ఉపయోగించాల్సిన మాస్కులతో కూడా వ్యాపారం చేస్తున్న వారిపై ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమంగా మాస్కుల నిల్వ చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: