క‌రోనా మ‌హ‌మ్మారి దేశ‌వ్యాప్తంగా మార‌ణ‌హోమం సృష్టిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాసిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం, కొంత‌మంది మృత్యువాత‌కు గుర‌వ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు అంతా అదుపులోనే ఉంద‌నుకున్నప్ప‌టికీ,  ‘ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌’తో ఒక్క‌సారిగా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 376 కొత్త కరోనా కేసులు, మూడు మరణాలు నమోద‌య్యాయి. అయితే ఢిల్లీలో జరిగిన మ‌త ప్రార్థ‌న‌ల‌కు హాజరై ‘కరోనా’తో తిరిగి స్వస్థలాలకు వెళ్లిన వారి వల్ల ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వ‌ర్గాలు నిర్దారించ‌డం గ‌మ‌నార్హం.  అంతేకానీ, ఇది దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ట్రెండ్‌ కాదని స్పష్టం చేసింది. 

కరోనాతో ఇప్పటివరకు 1,637 కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని వెల్లడించిన అధికారులు 132 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. వీరిని మినహాయిస్తే చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 1,446కి చేరుతుందని పేర్కొంటున్నారు. ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైన వారికి సంబంధించి బుధవారం కొత్తగా 154 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. వీటిలో జమ్మూకశ్మీర్‌ నుంచి 23, ఢిల్లీ నుంచి 18, తమిళనాడు నుంచి 65 ఉన్నాయని చెబుతున్నారు.  తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 234కి చేర‌గా, వీటిలో 110 కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైన వారికి సంబంధించినవే కావడం గమనార్హం. ఢిల్లీ జమాత్‌కు హాజరైన వారిలో ఉత్తరప్రదేశ్‌లో 569 మందిని, గుజరాత్‌లో 85 మందిని, కర్ణాటకలో 50 మంది విదేశీయులను క్వారంటైన్‌ చేశారు. గుజరాత్‌ నుంచి భారీగా దాదాపు 1,500 వరకు ఆ మత సమావేశాలకు హాజరయినట్లు సమాచారం. అస్సాం నుంచి ఢిల్లీ మర్కజ్‌కు 347 మంది హాజరు కాగా, వారిలో 230 మందిని క్వారంటైన్‌ చేసినట్లు ఆ రాష్ట్రం ప్రకటించింది. అంతేగాక క్వారంటైన్‌లో ఉన్న వారిలో అత్యధికులు హై రిస్క్‌ కేటగిరీలో ఉన్న నేపథ్యంలో.. కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: