భార‌త్‌లో న‌మోద‌వుతున్న క‌రోనా పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా  ఐదు రాష్ట్రాల నుంచే ఉండ‌టం గ‌మ‌నార్హం. అందులో మ‌హారాష్ట్ర మొద‌టిస్థానంలో ఉండ‌గా త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లు వ‌రుస క్ర‌మంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే వ్యాధి వ్యాప్తి ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..బుధ‌వారం ఉద‌యం నాటికి భారత్‌లో కేసుల సంఖ్య‌ 75,000కి చేరుకున్నాయి. అలాగే ఇప్పటి వరకు మొత్తం 24,420 మంది కోలుకున్నారు. 

 

మంగళవారం నాటికి బాధితుల రికవరీ రేటు 31.73%కి, మరణాల రేటు 3.24%కి చేరింది. అలాగే మంగళవారం రాత్రి వరకు కొత్తగా 3,543 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. వాస్త‌వానికి  నెల రోజుల కిందట మరణాల రేటు 3.23 శాతంతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు ఒకేలా ఉంది. రికవరీ రేటు మాత్రం 30 రోజుల్లో 9.05% నుంచి 31.73%కి చేర‌డం ఆశాజ‌న‌క‌మైన విష‌యంగా చెప్ప‌వ‌చ్చు.ఇదిలా ఉండ‌గా క‌రోనా  మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజ‌ధానిగా వ‌ర్ధిల్లుతున్న ముంబైలోనే అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. గడచిన ఆరు రోజుల్లో మహారాష్ట్ర వ్యాపత్ంగా 8,902 కేసులు నమోదుకాగా.. ఒక్క ముంబై నగరంలోనే 5,000 నిర్ధారణ అయ్యాయి. 

 

మంగళవారం మరో 426 కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబయిలో మొత్తం కేసుల సంఖ్య 14,521కి చేరింది. పుణే ప‌ట్ట‌ణంలోనూ క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది.  గడచిన 24 గంటల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే  కొత్తగా 1,000కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం.  రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 24,427కి చేరింది. దేశంలో న‌మోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40శాతానికి పైగా ఈ రాష్ట్రానివే కావ‌డం ఆందోళ‌న క‌ల‌గిస్తోంది. ఇక  పుణె జిల్లాలో  క‌రోనా కేసుల సంఖ్య‌ మూడు వేల మార్క్‌ని దాటేసింది. ఒక్క రోజు వ్యవధిలో ఆ జిల్లాలో 136 మంది వైరస్‌ బారిన పడ్డారు. పుణె మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే సుమారు 2,700 కేసులు ఉన్నాయి. ఇక ఆసియాఖండంలోనే అతిపెద్ద మురికివాడ‌గా ఉన్న ధారవిలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. గత 24 గంటల వ్యవధిలో అక్కడ 59 కొత్త కేసులు నమోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,000 దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: