క‌రోనా వైర‌స్ ర‌క్క‌సి నుంచి జపాన్ కొద్దికొద్దిగా బ‌య‌ప‌డుతోంది. వైర‌స్ వ్యాప్తి త‌గ్గి, కేసుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డంతో  భ‌యాందోళ‌న‌లు కూడా త‌గ్గుతున్నాయ‌నే చెప్పాలి. తాజాగా ఈ దేశంలో కరోనా కారణంగా ఆదివారం ఒక్కరు కూడా మృతి చెందలేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాదాపు మూడు నెలలుగా 24 గంటల్లో ఒక్కరు కూడా చనిపోకపోవడం ఇదే మొదటిసార‌ని  ఆరోగ్యశాఖ తెలిపింది. మరోపక్క ఆదివారం మొత్తం 38 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపింది. ఫిబ్రవరి చివరి వారంలో జపాన్ లోని హోక్కైడో కోవిడ్-19 కారణంగా అత్యవసర పరిస్థితిని విధించిన తొలి నగరం. స్కూల్స్ మూసేసి, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలను రద్దు చేశారు. 

 

 ప్రజలను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఆదేశించారు. స్థానిక ప్రభుత్వాలు వైరస్ ని నియంత్రించడానికి సత్వర చర్యలు చేపట్టి, వైరస్ సోకిన వారిని గుర్తించి, వారిని కలిసిన వ్యక్తులను వెంటనే నిర్బంధంలో ఉంచ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత మిగ‌తా న‌గ‌రాల‌ను కూడా క్ర‌మంగా అదే ప‌ద్ధ‌తిలో నిర్బంధంలోకి తీసుకెళ్లారు. ఈ విధానం సత్ఫలితాలివ్వ‌డంతో  మార్చి మాసాంతంలో క‌రోనా పాజిటివ్  కేసులు రోజుకి ఒకటి, రెండుకి పడిపోవ‌డంతో దేశ ప్ర‌జ‌ల్లో సంతోసం వ్య‌క్త‌మైంది.  ఏప్రిల్ మొదటి వారంలో స్కూళ్లను కూడా తెరిచారు. అయితే  కొన్ని న‌గ‌రాల‌కు లాక్‌డౌన్ నుంచి స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో క్ర‌మంగా కేసులు పెర‌గ‌డం మొద‌లైంది. 


 అత్యవసర పరిస్థితిని సడలించిన 26 రోజుల్లోనే తిరిగి విధించాల్సిన ప్ర‌మాద ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  జపాన్‌లో ఇప్పటివరకు మొత్తంగా 17,886 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు జపాన్‌లో 929 మంది మరణించారు. అయితే మిగ‌తా దేశాల‌తో పోలిస్తే జ‌పాన్ ప‌రిస్థితి ఎంతో మెరుగ్గా ఉంద‌నే చెప్పాలి.  కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా కరోనా వ్యాప్తిని ప్రభుత్వం ఆపగలిగింది. ప్రపంచదేశాలతో పోల్చితే జపాన్ ప్రభుత్వం అనేక మార్గాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగిందని నిపుణులు చెబుతున్నారు.  జపాన్‌లో కరోనా అదుపులోకి వచ్చేసింద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. మే 14 నుంచి జపాన్‌లో నిత్యం 100 లోపే కరోనా కేసులు నమోదవుతుండ‌టం గ‌మ‌నార్హం. మిగతా దేశాలతో పోల్చితే జపాన్ చాలా తక్కువ సంఖ్యలోనే కరోనా పరీక్షల నిర్వ‌హించ‌డం మ‌రో విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: