గత కొద్ది రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా పలు సడలింపులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే.. మిజోరాంలో నేటి నుంచి రెండు వారాల పాటు పూర్తిగా లాక్ డౌన్ కొనసాగనున్నది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జూన్ 9 నుంచి రాష్ట్రంలో 2 వారాల మొత్తం లాక్‌డౌన్ విధించాలని ముఖ్యమంత్రి జోరమ్‌తంగా అధ్యక్షతన జరిగిన సంప్రదింపుల సమావేశం నిర్ణయించినట్లు మిజోరాం ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. 

 

ఇటీవల మిజోరాంకు తిరిగి వచ్చిన ఐదుగురు వ్యక్తులకు శుక్రవారం కోవిడ్-19 సోకిన‌ట్టు నిర్దార‌ణ అయిన నేప‌థ్యంలో రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు 22 కు పెరిగాయి. కొత్త‌గా న‌మోదైన 5 కేసుల్లో న‌లుగురు ఢిల్లీ నుంచి రాగా, ఒక‌రు గుజ‌రాత్ నుంచి వ‌చ్చారు. వీరిలో ఇద్దరు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. ఈనేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి పెర‌గ‌కుండా ముందే జాగ్ర‌త్త వ‌హించాల‌నే ఆలోచ‌న‌తో  ఈ నెల 22 వరకు పూర్తిగా లాక్‌డౌన్‌ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్త‌వానికి కరోనావైరస్ కేసుల విస్తృతిని అదుపులో ఉంచడంలో మొద‌ట్లో ఈశాన్య రాష్ట్రాలు స‌మ‌ర్థ‌త‌ను ప్ర‌దర్శించాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు వైరస్‌ను నియంత్రించడంలో బాగా ప‌నిచేశాయ‌నే చెప్పాలి. 

 

అయితే మే మాసం నుంచే ఈ రాష్ట్రాల్లో క్ర‌మంగా కేసుల సంఖ్య పెరుగుతూ వ‌చ్చి నేడే ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ 8 రాష్ట్రాల్లో సుమారు 4 కోట్ల57 లక్షల మంది జనాభా ఉన్నారు. మే 14 నాటికి నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్‌లో మాత్రమే పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. మొత్తం 8 రాష్ట్రాల్లో అత్యధికంగా త్రిపురలో 155 కేసులు గుర్తించగా, 80 కేసులతో ఆ తర్వాత స్థానంలో అసోం ఉంది. 13 కేసులతో మేఘాలయా మూడో స్థానంలో ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: