క‌రోనా వైర‌స్ నిన్నా మొన్న‌టి వ‌ర‌కు మీడియా సంస్థ‌ల‌కు తీర‌ని ఆర్థిక‌,స‌ర్క్యూలేష‌న్‌కు తీవ్ర న‌ష్టాల‌ను మిగిలిస్తే ఇప్పుడు సిబ్బంది ప్రాణాల‌పై ప‌డింది. మీడియా సంస్థ‌ల్లోని సిబ్బంది ఇప్పుడు క‌రోనా కాటుకు బ‌ల‌య్యే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే ఓ ఎల‌క్ట్రానిక్ మీడియా సంస్థ‌లో ప‌నిచేస్తున్న మ‌నోజ్ అనే క్రైం జ‌ర్న‌లిస్టు క‌రోనాతో మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే మ‌రికొంద‌రు జ‌ర్న‌లిస్టులు క‌రోనా బారిన ప‌డిన‌ట్లు ఆదివారం వెల్ల‌డైన నిర్ధార‌ణ ఫ‌లితాల్లో వెలుగు చూసింది. కేవ‌లం 143మంది జ‌ర్న‌లిస్టుల ఫ‌లితాల్లోనే 23మందికి పాజిటివ్ రావ‌డంతో బెంబెలెత్తిపోతున్నారు. ఇందులో ఫీల్డ్‌లో తిరిగే రిపోర్ట‌ర్లే ఉండ‌టం గ‌మ‌నార్హం. 

 

 గత మూడు నెలలుగా కరోనాని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కోవిడ్ పాజిటివ్ రావడం విషాదకరం. ఇప్పటికే గాంధీలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక వార్డును కేటాయించారు. దానికి మనోజ్ కుమార్ పేరును నామకరణం చేశారు.అయితే డెస్క్‌లో ప‌నిచేసే వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆఫీసుల్లో వారితో క‌లివిడిగా ప‌నిచేసే అవ‌కాశం ఉంటుంది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. అందులోనూ హైదరాబాద్‌ నగరంలో కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోంది. నిరంతరం వార్తల సేకరణలో ఉండే విలేకరులపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది.

 

అయితే క‌రోనా బారిన ప‌డుతున్న వారిలో న్యూస్ పేపర్లలో కంటే టీవీ చానళ్ల‌లో ప‌నిచేస్తున్న సిబ్బందే  ఎక్కువగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆదివారం పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన వారంతా  మిగతా సిబ్బందితో ఎంతో సాన్నిహిత్యంగా క‌లిసి ప‌నిచేసిన వారే కావ‌డంతో ఇప్పుడు వారంతా తీవ్ర భ‌యాందోళ‌న చెందుతున్నారు.  హైదరాబాద్ లోని మీడియా ఆఫీసుల్లో ఇప్పటి వరకు 200కు పైగా కేసులు వచ్చినట్టు తెలుస్తోంది. రెగ్యులర్ గా ఆఫీసులకు వెళ్లి వస్తుంటారు.. కాబట్టి తమ ద్వారా.. మిగతా కుటుంబసభ్యులకు వ్యాపిస్తుందేమోనన్న భయం వారిలో నెల‌కొంటోంది.  స్వీయ రక్షణే శ్రీరామరక్ష అని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: