క‌రోనా భ‌యాన‌క  ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో త‌ల్లిదండ్రుల‌కు నిజంగా ఇది శుభ‌వార్తేన‌ని చెప్పాలి. క‌రోనా వ్యాధి లక్ష‌ణాల‌పై..దాని తీవ్ర‌త‌పై విస్తృత‌మైన ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఓ కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవంతో ప్రజలందరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా పాఠశాల విద్యార్థుల్లో కరోనా ప్రభావం తక్కువేనని ఫ్రెంచ్‌కు చెందిన పాశ్చర్‌ ఇన్సిస్టిట్యూట్ సర్వే తేల్చి చెప్పింది. పారిస్‌లోని క్రెపి-ఎన్-వలోయిస్ పట్టణంలోని  1,340 మంది ప్రజలతో పాశ్చర్‌ ఇన్సిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తల ఇటీవ‌ల స‌ర్వే నిర్వ‌హించింది. ఆరు ప్రాథమిక పాఠశాలలకు చెందిన 510 మంది విద్యార్థులు ఈ స‌ర్వేలో పాల్గొన్నారు. 

 

తాజా అధ్యయనంలో 61శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కరోనా సంక్రమించినట్లు సర్వే పేర్కొంది. అయితే ఆరోగ్యంగా ఉన్న 7శాతం మంది చిన్నారుల తల్లిదండ్రుల్లో వైరస్‌ వ్యాప్తి జరగలేదని, అంటే పెద్దల నుంచే ఎక్కువగా కరోనా సోకుతోంద‌ని సర్వే పేర్కొంది.ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, వ్యాధి సంక్రమణ తీవ్రత ఆధారంగా స్కూల్స్‌ ప్రారంభించే విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. డెన్‌మార్క్‌, స్విట్జర్లాండ్ దేశాలలో పాఠశాలలు ప్రారంభానికి యాజమాన్యాలు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇలాంటి స‌ర్వే ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా మారాయి.

 

ఇదిలా ఉండ‌గా చిన్నారుల్లో కనిపిస్తున్న వింత, ప్రమాదకరమైన లక్షణాలకు కరోనావైరస్‌తో సంబంధం ఉందేమో పరిశీలించాల్సిందిగా బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ వైద్యులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జ్వరం లాంటి లక్షణాలతోపాటు శరీరంలోని వివిధ అవయవాల్లో మంటపుట్టడం ఈ తరహా వ్యాధి లక్షణాలలో ఒకటిగా ఉంది. ఇలాంటి లక్షణాలున్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, సంఖ్యాపరంగా అలాంటి కేసులు తక్కువే అని భావిస్తున్నప్పటికీ ఈ లక్షణాలతో ఎంతమంది చిన్నారులు బాధపడుతున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త రోగ లక్షణాలు యూకేలో పెరుగుతున్న విషయాన్ని గుర్తించామని ఈ హెచ్చరికలు జారీ చేసిన ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ వెల్లడించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: