తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తోంది. కేవ‌లం ఆరు రోజుల కాలంలోనే రెట్టింపు కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. ఈనెల 17న 5వేల పైచిలుకు కేసులు న‌మోదు కాగా స‌రిగ్గా ఆరు రోజుల కాల వ్య‌వ‌ధిలోనే 10వేల‌కు పైగా చేరుకోవ‌డం ఇప్పుడు ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ముఖ్యంగా హైద‌రాబాద్‌లోనే 94శాతం కేసులు న‌మోదై ఉండ‌టం గ‌మ‌నార్హం.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,069 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,444కు చేర‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో ఈ ఒక్క‌రోజ కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 225 కు చేరింది. కొత్తగా 137 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

 

కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,361 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,858 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలున్న ప్ర‌తీ ఒక్క‌రికి ఇక‌పై ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది.  కరోనా పరీక్షల నిర్వహణకు ఇన్నాళ్లు అనుసరించిన స్ట్రాటజీని  మార్చింది.  దేశంలో క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేప‌థ్యంలో కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని తాజాగా  సూచించింది. కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రాన కంగారు పడి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదని ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ కావాల‌ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చ్ సూచించింది. 

 

ఐసీఎంఆర్‌ విడుదల చేసిన సూచనల ఆధారంగా వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖలు ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లకు సూచనలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ  రాష్ట్రంలో కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు పెంచాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.  అదే జ‌రిగితే మ‌రిన్ని కేసులు పెరిగే అవ‌కాశం ఉంది. ప‌రీక్ష‌లు ఎంత ఎక్కువ‌గా జ‌రిగితే అన్ని కేసులు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని వైద్య వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు 67,318 మందికి కోవిడ్‌ పరీక్షలు చేశారు. ఇక తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 719 కేసులు, రంగారెడ్డిలో 86, మేడ్చల్‌ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే మార్గం ద్వారానే కరోనాకు అడ్డుకట్ట వేయగలమని, ఇందులో టెస్టులను చాలా మందికి అందుబాటులోకి తీసుకురావడం కీలకమని ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ టెస్టు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అటువైగా చర్యలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: