హైద‌రాబాద్ ప‌రిధిలో క‌రోనా జోరు కొన‌సాగిస్తోంది. గ‌త వారం రోజులుగా నిత్యం 600పైనే కేసులు నిర్ధార‌ణ అవుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా బుధ‌వారం వెల్ల‌డైన ఫ‌లితాల్లో కూడా అదే రీతిన ఫ‌లితాలు ఉన్నాయి. రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తోంది. కేవ‌లం ఆరు రోజుల కాలంలోనే రెట్టింపు కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. ఈనెల 17న 5వేల పైచిలుకు కేసులు న‌మోదు కాగా స‌రిగ్గా ఆరు రోజుల కాల వ్య‌వ‌ధిలోనే 10వేల‌కు పైగా చేరుకోవ‌డం ఇప్పుడు ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ముఖ్యంగా హైద‌రాబాద్‌లోనే 94శాతం కేసులు న‌మోదై ఉండ‌టం గ‌మ‌నార్హం. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,069 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,444కు చేర‌డం గ‌మ‌నార్హం. 


రాష్ట్రంలో ఈ ఒక్క‌రోజ కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 225 కు చేరింది. కొత్తగా 137 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,361 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,858 యాక్టివ్‌ కేసులున్నాయి.  తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు 67,318 మందికి కోవిడ్‌ పరీక్షలు చేశారు. ఇక తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 719 కేసులు, రంగారెడ్డిలో 86, మేడ్చల్‌ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. హైద‌రాబాద్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌ల్లోకి తేవాల‌న్న డిమాండ్ బ‌లంగా వినిపిస్తోంది. అయితే ప్ర‌భుత్వం మాత్రం దానికి సుముఖంగా లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కంటోన్మెంట్ల విధానం మంచి ఫ‌లితాల‌ను ఇస్తోంద‌ని ప్ర‌భుత్వం భావిస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

 

 బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ మీడియాతో  మాట్లాడుతూ కరోనా విషయంలో కొందరు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వైద్యుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. క‌రోనా  లక్షణాలు లేనివారు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు రావొద్దని ఆరోగ్యమంత్రి స్ప‌ష్టం చేశారు. దీనివల్ల కరోనా పేషంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. లక్షణాలు ఉంటే ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టెస్టుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: