క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌నే మ‌ళ్లీ ప్ర‌ధానాస్త్రంగా ఎంచుకుంది ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం.  జులై 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ను పొడిగిస్తున్న‌ట్లు బెంగాల్ ప్ర‌భుత్వం బుధ‌వారం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న‌ లాక్ డౌన్ ఈ నెల 30తో ముగియ‌నుంది. కేసుల తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో.. మ‌రో నెల రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల ప్రకారం.. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు తెర‌వ‌బ‌డ‌వు, రైళ్లు, మెట్రో స‌ర్వీసులు ఉండవ‌ని స్ప‌ష్టం చేసింది.  కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 


బెంగాల్ లో 14,728 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 580 మంది కరోనా రోగులు మృతి చెందారు.కాగా.. మమత ప్రభుత్వం తీసుకున్న హఠాత్ నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. ఇదిలా ఉండ‌గా దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,56,183 కరోనా కేసులు నమోదు కాగా.. 14,476 మరణాలు నమోదయ్యాయి. 


దేశంలో 1,83,022 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌)  ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇప్పటివరకు 73,52,911 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 93.59 లక్షల మంది ఈ కరోనా మహమ్మారి బారిన పడగా.. 4.79 లక్షల మంది మరణించారు. అత్యధిక కరోనా కేసులతో అమెరికా (24.42 లక్షలు) అగ్రస్థానంలో ఉండగా. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ (11.51 లక్షలు), రష్యా (5.99లక్షలు) దేశాలు ఉన్నాయి. అత్యధిక కరోనా కేసులు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: