నాలుగు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్ నగరంలో పర్యటించనుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ టీమ్.. ఉదయం 9.30గంటలకు దోమలగూడ ధోబీ గల్లీలో పర్యటించిన అనంతరం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో గాంధీ ఆస్పత్రిని సందర్శించనుంది. అక్కడ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30గంటల వరకు గచ్చిబౌలి చేరుకొని టిమ్స్ ఆస్పత్రిని లవ్ అగర్వాల్ టీమ్ పరిశీలించనుంది. ఈ క‌మిటీ ప‌రిశీల‌న నివేదిక అనంత‌రం ప్రారంభానికి మార్గం సుగ‌మం కానుంద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గాటిమ్స్‌ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదు? అంటూ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించిన మరుస‌టి రోజే ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించి స‌మీక్ష నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. 

 

కరోనా చికిత్స కోసం ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దిన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను గ‌త బుధవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. టిమ్స్‌లో నాలుగురోజుల్లో ఐపీ సేవలు ప్రారంభిస్తామని ప్రకటించారు. టిమ్స్‌లో 1,224 పడకలు ఉండగా, 1,000 ఆక్సిజన్‌ పడకలు, 50 వెంటిలేటర్‌ పడకలు అందుబాటులో ఉండ‌నున్నాయి. 15 ఫ్లోర్లు సిద్ధ‌మ‌య్యాని ప్ర‌క‌టించారు. అయ్యాయని, సెల్లార్‌లో క్యాంటీన్‌ ఉంటందని, రోగులకు భోజనం అందిస్తామని తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీ స్‌, ల్యాబ్‌, మిగిలిన 13 ఫ్లోర్లలో రోగులకు పడకలు ఏర్పాటుచేశామని వివరించారు. చండీగఢ్‌లోని పీజీ కాలేజీ తరహాలో టిమ్స్‌ పీజీ కాలేజీ కూడా వైద్యులను అందించబోతున్నదని తెలిపారు. 


సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు టిమ్స్‌ కేరాఫ్‌ అడ్రస్‌ కావాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. కార్పొరేట్‌ దవాఖానల్లో లేని హంగులు టిమ్స్‌లో ఉన్నాయని, ఇంతటి అత్యాధునిక దవాఖాన మరెక్కడాలేదని చెప్పారు. అయితే క‌రోనా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఏమాత్రం బాధ్యతాయుతంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు విప‌క్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఎక్కువగా కరోనా టెస్ట్‌లు చేయకపోవడం వల్లే నేడు రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి జ‌రిగింద‌ని కాంగ్రెస్ పేర్కొంటోంది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు పెట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: