గ‌డిచిన కొద్ది రోజులుగా ఢిల్లీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లతో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. గ‌డిచిన ప‌దిరోజులుగా అక్క‌డ వెలువడుతున్న ఫ‌లితాలే ఇందుకు నిద‌ర్శ‌నంగా తెలుస్తోంది. నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య గ‌తంలో క‌న్నా ఎక్కువ‌గా జ‌రుగుతున్నా..నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ ప‌ర్సంటేజీ త‌గ్గ‌డం..ఢిల్లీలో మారిన ప‌రిస్థితుల‌ను తెలియ‌జేస్తున్నాయ‌ని ఆప్ ప్ర‌భుత్వం పేర్కొంటోంది. ఢిల్లీ ప్ర‌జ‌లు ఇదే క్ర‌మ‌శిక్ష‌ణ‌ను, ఆశావ‌హ దృక్ప‌థాన్ని, క‌రోనా వైర‌స్‌పై పోరాటాన్ని కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. వాస్త‌వానికి దేశ రాజధాని ఏప్రిల్‌, మే, జూన్ మాసం మొద‌టి వ‌ర‌కు కూడా  కరోనా కేసులతో అట్టుడికిపోయింది. 

 

జూన్ నెలలో కరోనా హాట్‌స్పాట్ ముంబయినే బీట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న నగరాల జాబితాలోకి వెళ్లింది. కేవలం నెల వ్యవధిలోనే 66,526 కేసులు నమోదయ్యాయి. గతనెల 23న సుమారు నాలుగువేల కేసులు(3,906) నమోదైన ఢిల్లీలో తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్ట‌డం విశేషం. వారం రోజులుగా కొత్త కేసులు మూడువేల లోపే రిపోర్ట్ అవుతున్నాయి. ఇందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లే ప్ర‌ధాన కార‌ణంగా చెప్పాలి.కాంటాక్టులను గుర్తించడానికి డోర్ టు డోర్ నిఘా టీం వెళ్తుండ‌టం మంచి ఫ‌లితాల‌ను ఇస్తోంద‌ని వైద్యులు చెబుతున్నారు. త్వ‌రితంగా గుర్తించి వారి ద్వారా ఇత‌రుల‌కు వ్యాప్తి చెంద‌కుండా నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని పేర్కొంటున్నారు. 

 


 గతనెల 27వ తేదీన 2,948 కేసులుండగా తర్వాత వరుసగా 2,889- 2,084- 2,199ల కేసులు నమోదయ్యాయి. ఈ నెలలోనైతే 1వ తేదీన 2,442 తర్వాతి రోజున 2,373, 3వ తేదీన 2,520 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మే 1న తొలి కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ తర్వాతి 41 రోజుల్లో వెయ్యి మార్కును దాటగా, మరో తొమ్మిది రోజుల్లో 10వేలను క్రాస్ చేసింది. జూన్ 1న 20,834 కేసులున్నాయి. మొత్తం కేసుల్లోనూ మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో కొనసాగిన ఢిల్లీ నేడు మూడో స్థానానికి చేరింది. కొత్త కేసుల్లో జాతీయ సగటు కన్నా తక్కువే ఉన్నది. టీకా కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే ఇప్పటికి విజయవంతంగా కనిపిస్తున్న ప్లాస్మా థెరపీ కోసం కేజ్రీవాల్ సర్కారు సిద్ధమైన విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: