భార‌త్‌లో క‌రోనా విల‌యం సృష్టిస్తూనే ఉంది.  కరోనా వైరస్ కేసుల్లో ఇండియా మూడో స్థానంలోకి చేరుకున్న విష‌యం తెలిసిందే. అమెరికా, బ్రెజిల్ తరువాత ఈ స్థానంలో భార‌త్ ఉంది. కరోనా విజృంభణ మన దేశంలో ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. అన్‌లాక్‌ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కోవిడ్‌ కేసుల సంఖ్యగా భారీగా పెరుగుతూ వస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు 7 లక్షల మార్క్‌ను దాటగా, మరణాల సంఖ్య 20 వేలు దాటింది. తాజాగా భార‌త వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం క‌రోనా మ‌రింత విస్త‌రిస్తూనే ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. క‌రోనా గ‌ణాంకాల విశ్లేష‌ణ ఇలా ఉంది.  

 

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరింది. 24 గంటల్లో 467 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 20,160కు చేరింది. 24గంట‌ల్లో  24వేల‌కు పైగా న‌మోదైన కేసుల‌ను ప్రామాణికంగా తీసుకుని క‌రోనా బారిన ప‌డే స‌గ‌టు స‌మ‌యాన్ని విశ్లేషిస్తే  ఈవిధంగా ఉంటోంది. 24గంట‌ల చొప్పున‌.. 24వేల కేసుల‌ను రోజు స‌గ‌టుగా విశ్లేషిస్తే..(పై చిలుకుగా ఉన్న కేసుల‌ను ప‌క్క‌న పెట్ట‌గా) నిముషానికి 16మందికి పైగా క‌రోనా బారిన ప‌డుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే కేసుల సంఖ్య మ‌రింత పుంజుకునే అవ‌కాశం స్ప‌ష్టంగా తెలుస్తున్న నేప‌థ్యంలో నిముషానికి క‌రోనా బారిన ప‌డే వారి సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. 

 

ఇదిలా ఉండ‌గా గడచిన 24 గంటలలో భార‌త్లో  2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపారు. 4,39,947 మంది కోవిడ్‌ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 61.13 శాతంగా నమోదయింది. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మ‌రోవైపు  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని.. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్ స్ప‌ష్ట‌త ఇవ్వడంతో జ‌నాల్లో మ‌రింత ఆందోళ‌న పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: