టిమ్స్ ప్రారంభోత్స‌వంపై ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతూనే ఉంది. కొవిడ్‌ రోగుల కోసం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవంపై గంద‌ర‌గోళం నెలకొంది. ఆ ఆస్పత్రిని ఏర్పాటు చేసి 3 నెలలు కావ‌స్తున్న‌ప్ప‌టికీ ప్రారంభోత్స‌వానికి మాత్రం నోచుకోవ‌డం లేదు. క‌ర్ణుడి చావుకు కార‌ణాలే అనేకం అన్న‌ట్లుగా..టిమ్స్ ప్రారంభోత్స‌వం కాక‌పోవ‌డానికి కూడా అన్ని కార‌ణాలున్నాయ‌ని అధికార వ‌ర్గాల నుంచి స‌మాధానాలు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి గ‌త ఆదివారం సాయంత్రం టిమ్స్‌ ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ విమల థామస్‌ ఆధ్వర్యంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఓఎ్‌సడీ, వ్యక్తిగత కార్యదర్శి, పీఏతోపాటు ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు.

 

ఆ నివేదికను మంత్రికి ఇవ్వడంతో సోమవారం ఆస్పత్రిని ప్రారంభించడానికి ఆదేశాలు జారిచేశారు. మంత్రి ఈటెల రాజేంద‌ర్ రానున్నార‌ని చెప్పి  కరోనా పాజిటివ్‌ వచ్చి హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి సమాచారమిచ్చి వారిని ఆస్పత్రికి తీసుకురావాలని వైద్యాధికారుల‌కు కూడా సూచించారు.  ఈమేర‌కు వారు కూడా సోమవారం పొద్దుటికల్లా టిమ్స్‌ ఆస్పత్రికి రావాలంటూ హోంక్వారంటైన్‌లో ఉన్న 50 మంది వ‌ర‌కు ఫోన్ ద్వారా తెలిపారు. మ‌ళ్లీ అంత‌లోనే ఇప్పుడే రావ‌ద్దు..ఎప్పుడు రావాలో మేమే స‌మాచారం అందిస్తామంటూ క‌రోనా పాజిటివ్ రోగుల‌కు స‌మాచారం అందించారు. దీంతోవారంతా నిరాశ‌కు గుర‌య్యారు. 


వైద్య పోస్టుల భ‌ర్తీ పూర్తికాక‌పోవ‌డంతోనే టిమ్స్ ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాన అడ్డంకిగా మారుతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. టిమ్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన 499 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా.. 13,090 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టారు. అయితే నియమితులైన వారిలో దాదాపు 50 శాతం మంది పోస్టుల్లో చేరలేదు. టిమ్స్‌లో సేవలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుండడంతో.. మరోసారి ఖాళీల భర్తీపై వైద్యఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇదిలా ఉండ‌గా గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యసేవలు ఎందుకు ప్రారంభించడం లేదని విప‌క్షాల నుంచి ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది.  టిమ్స్ ప్రారంభంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని  డిమాండ్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: