సుమారు గత 10 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటికీ తన ప్రభావంతో చాలా దేశాల్లో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుంది. ఆ మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ కోసం పలు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా శ్రమిస్తుంటే మరోవైపు తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కరోనాకు టీకా ఒకవేళ వచ్చే ఏడాది తొలినాళ్లలో వచ్చినా దానిని వేయించుకోడానికి 61 శాతం మంది ఆసక్తి చూపడం లేదని లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వేలో వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా 225 జిల్లాల్లోని 25వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ సర్వేలో... ఒకవేళ కరోనాకు టీకా వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి వస్తే వేయించుకుంటారా? కోవిడ్-19కు ముందున్న యథాతథ పరిస్థితి నెలకుంటుందా? అని 8,312 మందిని ప్రశ్నించగా.. 61 శాతం మంది టీకా వేయించుకోడానికి ఆసక్తి చూపలేదు. అంతేకాదు, టీకా ఉచితంగా వేస్తామన్నా దుష్ప్రభావాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే అనుమానంతో 51 శాతం మంది వద్దన్నారు. అలాగే, వచ్చే ఏడాదిలో ఎప్పుడొచ్చినా అసలు తాము వ్యాక్సిన్ వేయించుకోబోమని 10 శాతం మంది పేర్కొన్నారు. కరోనాతో కలిసి బతికేస్తామని 8,496 మందిలో 38శాతం మంది వెల్లడించగా... ఆంక్షలతో చాలా విసిగిపోయామని 23శాతం ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కానీ, 33 శాతం మంది ఆందోళన చెందుతున్నామని చెబితే.. ఒత్తిడిలో ఉన్నామని 20శాతం వెల్లడించారు. దాని పని దానిదే.. మన పని మనదే అనే విధంగా 19శాతం మంది సమాధానమిచ్చారు. టీకా వచ్చిన తర్వాత పరిస్థితి సాధారణంగా ఉంటుందని 12 శాతం మంది చెప్పగా.. 25 శాతం మంది మాత్రం టీకా వచ్చినా సాధారణ పరిస్థితి నెలకోవడం కష్టమని పెదవి విరిచారు. కరోనా వైరస్ ఆంక్షలు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఉంటాయని 14 శాతం మంది, వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటాయని 6 శాతం మంది అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి దేశంలో ప్రారంభమైన 8 నెలల తర్వాత దానిపై ప్రజల ఆలోచనా విధానం, అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశామని ఆ సంస్థ తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 72శాతం పురుషులు, 28శాతం మహిళలు ఉన్నారని తెలిపింది. వీరిలో టైర్-1 సిటీవాసులు 54 శాతం, టైర్-2 సిటీవాసులు 24 శాతం, మిగతా 22 శాతం టైర్-3, 4, గ్రామీణ జిల్లాలవారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: