ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న, జరగబోతున్న అన్ని ఎన్నికల వాగ్దానాలలో ప్రధానాంశం కరోనా వ్యాక్సిన్. ఎవరికి వారు తాము గెలిస్తే ప్రజలందరికీ అతి త్వరలో ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ప్రచార సభల్లో ఊదరగొడుతున్నారు. ఇక అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండగా.. కరోనా వ్యాక్సిన్ విషయమై ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికల్లా 4 కోట్ల టీకా డోసులను సరఫరా చేయగలమని పేర్కొంది. టీకా లభ్యతపై ఆచితూచి స్పందించిన ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా.. అంతా అనుకున్నట్టు జరిగి క్లినికల్ ట్రయల్స్ పూర్తయి ప్రభుత్వ అనుమతులు లభిస్తే..ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో ఏకంగా 4 కోట్ల డోసులను పంపిణీ చేయగలమని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 10 కోట్ల టీకా డోసులు సిద్ధమవుతాయని వివరించారు.

టీకా సమర్ధతపై కూడా మాట్లాడిన ఆయన.. ఈ విషయంలో పూర్తి సమాచారం అక్టోబర్ నెలఖరుకి అందుబాటులోకి రావచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసర వినియోగం కింద టీకా అనుమతి కోసం నవంబర్‌ మూడో వారంలో దరఖాస్తు చేయాలని భావిస్తున్నట్టు అల్బర్ట్ తెలిపారు. టీకా కచ్చితంగా పనిచేస్తుందని మీరు బలంగా విశ్వసిస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన ఆచితూచి స్పందించారు. ఈ విషయంలో నేను అతివిశ్వాసాన్ని ప్రదర్శించాలనుకోవడం లేదని సమాధాన ఇచ్చారు. అయితే.. టీకా సమర్ధంగా పనిచేసే అవకాశం ఉందని అనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనా కారణంగా సాధారణ వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇతర ఔషధాలకు భారీగా డిమాండ్ తగ్గింది. ఈ ప్రభావం ఫైజర్ లాభాలపై తీవ్రంగా పడింది. మునపటితో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సంస్థ లాభాల్లో క్షీణత నమోదయ్యింది. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. కరోనా కారణంగా సంస్థ లాభాల్లో ఏకంగా 71 శాతం మేర కోత పడింది. ఈ విషయంలో సంస్థ అంచనాలు తారుమారయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: