ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దాని నివారణకు వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తృత స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లకు ప్రయోగాల దశలలోనే పలు ఇబ్బందులు ఎదురయిన విషయం కూడా తెలిసిందే. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ టీకా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపితే వారికి తగిన వైద్య సహాయం అందేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో కోవిడ్ బీమా పథకాన్ని ప్రకటించారు. ‘కోవాక్స్’‌ ప్రమోటర్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ‘గావి’ సంయుక్తంగా సహాయక నిధిని ఏర్పాటు చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.

కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు సమానంగా అందజేయడమే లక్ష్యంగా కోవాక్స్‌ కూటమి ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై భయాలు, అపోహలను పోగొట్టేందుకు ఈ బీమా పథకాన్ని చేపట్టినట్టు కోవాక్స్‌ వివరించింది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావి పర్యవేక్షించనున్నాయి. ప్రస్తుతం ఎటువంటి టీకా మార్కెట్‌లోకి విడుదల కాలేదు. డిసెంబరు నాటికి తొలి టీకా సిద్ధమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది చివరికి రెండు వందల కోట్ల డోసుల పంపిణీకి కోవాక్స్‌ సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా బీమా పథకం వల్ల ఆఫ్రికా, ఆగ్నేయాసియాల్లోని 92 అల్పాదాయ దేశాల ప్రజలకు రక్షణ, ప్రయోజనం కలగనుంది. కరోనా వ్యాక్సిన్‌ వినియోగం అనుకోని దుష్ప్రభావాలు సంభవిస్తే వైద్య సహాయం కోసం ఆయా ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడకుండా ఈ పథకం సహాయపడుతుందని ప్రతినిధులు వివరించారు. ఈ పథకం ద్వారా ఆయా దేశాలకు 2022 జులై వరకు కోవాక్స్‌ బీమా రక్షణ లభించనుంది. అయితే ఈ సదుపాయం కేవలం పేద దేశాలకు మాత్రమేనని, మధ్యాదాయ దేశాలకు వర్తించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీదారులే ఈ బాధ్యతలను చేపట్టాల్సి ఉండగా.. వారు సానుకూలంగా స్పందించకపోవటంతో తాము నిర్వహిస్తున్నట్టు కోవాక్స్‌ పేర్కొంది. బాధితులు వైద్య సహాయం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా వారికి సత్వర ఉపశమనం కలిగించేలా ఈ బీమా పథకం ఉపకరిస్తుందని సంస్థ తెలిపింది.  దశాబ్దం కిందట స్వైన్ ఫ్లూ విజృంభించిన సమయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా నాటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ ఏర్పాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: