ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడి కోసం వివిధ దేశాల ఫార్మా నిపుణులు రూపొందించిన టీకాలు మంచి ప్రభావమే చూపుతున్నట్టుగా సానుకూల ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ కరోనా వైరస్ మహమ్మారి ముగింపుపై ప్రపంచం కలలు కనే సమయం ఆసన్నమైందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు.


మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అప్రమత్తత, జాగ్రత్తతో ఉండాలని హెచ్చరిస్తూ వచ్చిన డబ్ల్యూహెచ్‌వో.. సుదీర్ఘకాలం తర్వాత సానుకూల ప్రకటన చేయడం విశేషం. సాధారణ సభ నిర్వహించిన తొలి ఉన్నతస్థాయి సమావేశంలో అధనామ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఔషధాలు, టీకాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని పలు అధ్యయనాలు పేర్కొన్నా.. డబ్ల్యూహెచ్‌వో మాత్రం ఇప్పటివరకు కరోనా సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వచ్చింది. అయితే తాజా ప్రకటన దీనికి భిన్నంగా ఉండటం యావత్తు ప్రపంచానికి కాసింత ఊరటనిచ్చే అంశమే. అయితే, టీకా విషయంలో పేద, మధ్యాదాయ దేశాలపై ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించరాదని టెడ్రోస్‌ సూచించారు. కరోనా అంతానికి సమయం ఆసన్నమవుతున్నప్పటికీ ఆ దిశగా వెళుతున్న మార్గమే కొంత అనుమానాస్పదంగా ఉందని అభిప్రాయపడ్డారు.


పరోక్షంగా పేద దేశాలకు టీకా అందుబాటులోకి రావడంపై ఉన్న సందేహాలను వెలిబుచ్చారు. ఈ మహమ్మారి కాలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచితో పాటు చెడునూ వెలుగులోకి తెచ్చిందన్నారు. ఈ కష్టకాలంలో ప్రజల నిబద్ధత, త్యాగం, శాస్త్ర విజ్ఞానం, మనసుల్ని కలచివేసిన సంఘీభావాలు అందరికీ స్ఫూర్తిగా నిలిస్తే.. స్వార్థం, విభజన, పరస్పర నిందారోపణలు కలచివేశాయని వ్యాఖ్యానించారు. పేదరికం, ఆకలి, అసమానత, పర్యావరణ మార్పుల వంటి శాశ్వత సమస్యలకు ఎలాంటి వ్యాక్సిన్‌ పరిష్కారం చూపలేదని అధ్నామ్‌ అన్నారు. మహమ్మారి కాలం ముగియగానే ప్రతిదేశం ఈ సవాళ్లపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఉత్పత్తి, వినియోగం విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఏకచ్ఛత్రాధిపత్యం, ప్రకృతి సమతౌల్యతను కాపాడడం పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి, బెదిరింపులు, అనవసరపు జోక్యాలు, విభజన రాజకీయాలవైపు తిరిగి అడుగులు వేయరాదని సూచించారు.


వ్యాక్సిన్‌ను ప్రయివేట్‌ వినియోగ వస్తువుగా చూడరాదని.. అందరికీ అందుబాటులోకి వచ్చేలా పంపిణీ వ్యవస్థ ఉండాలని టెడ్రోస్‌ సూచించారు. టీకా పంపిణీ కోసం డబ్ల్యూహెచ్‌వో ఏసీటీ-యాక్సిలరేటర్‌ కార్యక్రమానికి మరికొన్ని నిధులు అవసరమని.. లేదంటే ఓ ఉన్నత లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తక్షణం 4.3 బిలియన్‌ డాలర్లు అవసరం ఉండగా.. 2021కి మరో 23.9 బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని తెలిపారు. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత జీ20 దేశాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో ఈ మొత్తం కేవలం 0.005 శాతమేనని తెలిపారు. అలాగే, టీకా వేయించుకుంటామని అమెరికా తాజా, మాజీ అధ్యక్షులు చేసిన బహిరంగ ప్రకటనపై అధ్నామ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలు వ్యాక్సిన్‌పై ప్రజలకున్న అపోహలను తొలగించి, విశ్వాసం కలిగిస్తాయన్నారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షలు బారక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్‌లు టీకా వేయించుకోడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వారిది మంచి ఆలోచన.. టీకా విషయంలో వారి నిబద్ధతను చాటుకున్నారు.. ఇది చాలా ప్రభావం చూపుతుందని అధ్నామ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: