ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలన కోసం గత ఏడాది కాలంగా వేచి చూస్తున్న నిరీక్షణకు ముగింపు పలుకుతూ వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో సంబరాలకు సిద్దపడుతున్నారు. అయితే ఇప్పటికే యూకేలో ఇటీవలే వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వైరస్ కంటే ఇది మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. సాధారణ వైరస్ కంటే 70 శాతం అధిక వేగంతో ఇది వ్యాపిస్తోందని తెలిపారు. యూకేలో ఈ వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక అటు యూఎస్‌లోనూ పరిస్థితి అదుపు తప్పుతోంది. రాబోయే రెండు నెలల్లో అంటే మార్చికల్లా అమెరికాలో ఈ కొత్త వైరస్ మహమ్మారిగా మారొచ్చని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (US Centres for Disease Control and Prevention) హెచ్చరించింది. యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసులు అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో మరిన్ని చర్యలు చేపట్టాలని సీడీసీ వైద్య నిపుణులు డాక్టర్ గ్రెగరీ ఆర్మ్‌స్ట్రాంగ్ సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చేంతవరకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లాంటి జాగ్రత్తలను పాటించాలని ప్రజలకు సూచించారు.





అమెరికాలో గత డిసెంబర్ నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే.. ఇది ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. ఓ వైపు టీకాల పంపిణీ కొనసాగుండగా.. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య, కొవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇది అగ్రరాజ్యాన్ని కలవరానికి గురిచేస్తోంది. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, జాగ్రత్తలపై ప్రభుత్వానికి సీడీసీ ఓ నివేదిక సమర్పించింది. ‘ప్రస్తుత వైరస్‌తో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరం. సరైన చర్యలు చేపట్టకపోతే మార్చి వరకు మహమ్మరిగా మారవచ్చు. వ్యాక్సిన్ కవరేజ్‌ను భారీగా పెంచడం ద్వారా ప్రజలను కాపాడవచ్చు’ అని సీడీసీ సూచించింది. మరోవైపు.. భారత్‌లో యూకే కరోనా స్ట్రెయిన్ కు సంబంధించిన కేసులు 116కు చేరుకున్నాయి. శనివారం (జనవరి 16) మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కావున ప్రజలందరూ తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: