సాధారణంగా తాజా పండ్లను తింటున్నప్పుడు వాటిలో ఉండే విత్తనాలను మనం ఖచ్చితంగా ఉమ్మేస్తాము. మనలో చాలామంది విత్తనాలను ఉమ్మేస్తారు కానీ కొంతమంది మాత్రమే ఆ  విత్తనాలు తినడం అలవాటుగా  చేసుకున్నారు. ఆ విత్తనాలలో ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి అని చాలా మందికి తెలియదు. ఎన్నో తాజా పండ్లలో కలిగిన విత్తనాలలో పుచ్చకాయ విత్తనాలు కూడా ఒకటి. పుచ్చకాయలను ఎక్కువగా వేసవి కాలంలో దాహాన్ని తీర్చుకోవడానికి తింటుంటారు.అంతేకాకుండా శరీరంలో ఎక్కువ తేమ శాతాన్ని నింపుకోవాలంటే పుచ్చకాయలు ఎంతో అవసర పడతాయి.  ఇంతలా శరీరానికి మేలు చేసే పుచ్చకాయ కంటే  దాని విత్తనాలు రెట్టింపు స్థాయిలో మనకు ఉపయోగపడతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చదివి తెలుసుకుందాం.


పుచ్చకాయ విత్తనాలు తినాలనుకునేవారు, ఒకప్పుడు ఎండబెట్టి వాటిపై ఉండే పొట్టుని తీసి తినేవారు. ప్రస్తుత కాలంలో ఎలాంటి కష్టం లేకుండా ఆటోమేటిగ్గా పుచ్చకాయ విత్తనాలను  ప్యాక్ చేసి మరీ అమ్ముతున్నారు. పుచ్చకాయ విత్తనాలలో  మెగ్నీషియం,పొటాషియం, జింక్  పుష్కలంగా లభిస్తాయి. మెగ్నీషియం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇక ఐరన్ సమృద్ధిగా దొరకడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.

గింజల్లో మోనోఅన్శాచురేటెడ్, పాలీ అన్ సాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతగానో సహాయపడతాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బులు రాకుండా ఉంచుతాయి. ఈ గింజలను తినడం వల్ల ఎముకల సమస్యలు కూడా తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులు , కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవారు రోజూ ఒక స్పూన్  పుచ్చకాయ గింజలను పొడి చేసుకొని తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఇందులో ఉండే జింక్  కారణంగా మెదడు సంబంధిత వ్యాధులను కూడా అరికట్టవచ్చు. జింక్ లోపం ఉన్న వారిలో జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలెక్కువ. కాబట్టి  ఈ గింజలను  ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇలా ఎన్నో రకాల లాభాలను పుచ్చకాయ గింజల ద్వారా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: