గత పది నెలలుగా దేశంలోని అన్ని రంగాల ప్రజలు ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సతమతం అయ్యారు, నేటికీ ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ప్రాంతాలలో వ్యాక్సిన్ డ్రైన్ భారీ ఎత్తున నిర్వహించటం తెలిసిందే. ఇక ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ జనవరి 16న ప్రారంభించింది.



తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేకమంది చనిపోయారనే విషయం తెలిసిందే. అయితే చాలామంది కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా లక్షల రూపాయలు ఫీజులు కట్టి కోవిడ్ భయంతో చికిత్స చేయించుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారందరికీ కేసీఆర్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వ్యాధికి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి రూ. లక్ష వరకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ అందివ్వనుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా దీనికి సంబంధించిన మెమో జారీ చేశారు. హోంశాఖ వివరణ కోరడంతో ఈ మెమో ఇవ్వడం గమనార్హం. ఇన్ ‌పేషెంట్లుగా చికిత్స పొందినవారికి గరిష్టంగా రూ.లక్ష వరకు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు సౌకర్యం ఉంటుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)లో ఈ వసతి లేకపోవడంతో అనేకమంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు 25 లక్షల మంది ఉంటారు. తాజా నిర్ణయం లక్షలాది మందికి ప్రయోజనం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల ఉద్యోగులు... వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: