ఇంటర్నెట్ డెస్క్: వర్కౌట్లు చేసే ముందు చాలా మంది కడుపు పూర్తిగా ఖాళీ చేసుకుంటారు. కానీ అలా పరగడుపున వ్యాయామాలు చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయటమంటే పెట్రోలు లేకుండా కారును నడపటం లాంటిదే అనుకోవచ్చు. దీనివల్ల వర్కౌట్ చేసినప్పుడు శరీరం శక్తి కోసం విలువైన కొవ్వు నిల్వలను వాడుకుంటుంది. అంతేకాకుండా పరగడుపున రక్తంలో గ్లూకోజు స్థాయులు తక్కువగా ఉండటం వల్ల తల తేలిపోవటం, వికారం, వణుకు వంటి లక్షణాలు తలెత్తొచ్చు. మధుమేహులకు ఇది మరింత ముఖ్యం.

నిరంతరం శక్తి కోసం కొవ్వును వినియోగించుకుంటూ ఉండటం వల్ల మన శరీరం దీనికి సర్దుకుపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ క్రమంలో కోల్పోయిన కొవ్వును భర్తీ చేసుకోవటానికి మరింత కొవ్వును నిల్వ చేసుకునేందుకూ ప్రయత్నిస్తుంటుంది. పరగడుపున భారీ కసరత్తులు చేస్తే కండరాలు క్షీణించే ప్రమాదమూ ఉంది. అయితే బరువు తగ్గాలని భావించేవారు మాత్రం పరగడుపున భారీ కసరత్తులు చేయకుండా నిపుణుల సూచనల మేరకు వర్కౌట్ చేస్తే బాగా ఉపయోగపడతాయి. అంటే వర్కౌట్ ఉద్దేశాన్ని బట్టి ఆహారం తీసుకోవాలా..? వద్దా..? అనేది ఆధారపడి ఉంటుంది.

వర్కౌట్‌కు ముందు ఇవి తింటే బెటర్..
వర్కౌట్లకు ముందు ఏదైనా కొద్దిగా తిన్న తర్వాత ఆరంభిస్తే ఎక్కువసేపు, ఉత్సాహంగా వ్యాయామాలు చేయొచ్చు. మజిల్ బిల్డింగ్ కోసం వర్కౌట్ చేసేవారు కచ్చితంగా ఇవి తిరాలి. మరేం తినాలి? తగినన్ని నీళ్లు తాగటం అన్నింటికన్నా ముఖ్యం. వ్యాయామం చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూడటానికి నీళ్లు, ద్రవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే పొట్టుతీయని ధాన్యాలతో కూడిన ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు తినటం మంచిది. ఉదాహరణకు- కార్న్‌ ఫ్లేక్స్‌ వంటివి వెన్న తీసిన పాలతో కలిపి తినొచ్చు. పొట్టుతో కూడిన గోధుమ టోస్ట్‌, పాస్తా, వెన్న తీసిన పెరుగు, దంపుడు బియ్యం అన్నం వంటివైనా తీసుకోవచ్చు. అరటి, యాపిల్‌, ఎండుద్రాక్ష వంటి పండ్లు తినొచ్చు. లేదంటే వాటితో చేసిన గుజ్జు ద్రవాలు తాగొచ్చు.

పీచుతో కూడినవి కాకుండా ఉడకబెట్టిన బంగాళాదుంపల వంటి కూరగాయలు తినొచ్చు. అయితే పీచుతో కూడినవైతే త్వరగా జీర్ణం కావు. ఇవి వర్కౌట్ చేసేటప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటివి ఏవైనా సరే.. వర్కౌట్ కంటే కనీసం అరగంట ముందు తింటే మంచింది. అలాగని మరీ ఎక్కువగా తినటం తగదు. వీటిని జీర్ణం చేసుకోవటానికి శరీరం ఎక్కువ రక్తం, ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది. దీనివల్ల వర్కౌట్ చేసే సమయంలో ఇబ్బంది కలిగిస్తుంది. కొందరు కసరత్తులు చేసేటప్పుడు శక్తినిచ్చే పానీయాలు తాగుతుంటారు. ఇది మంచిది కాదు. ఇవి గుండె వేగం, రక్తపోటు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకుల వంటివీ తీసుకోవద్దు. వీటిల్లో చక్కెరతో పాటు కెఫీన్‌ కూడా ఉంటుంది.

వర్కౌట్ తరువాత ఏం తినాలి..?
వర్కౌట్లు చేసే ముందులానే చేసిన తరువాత కూడా తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే పిండి పదార్థాలు, ప్రొటీన్‌ సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ఇవి కండరాల్లో ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా వ్యాయామాలతో కష్టపడ్డ కండరాలు వేగంగా కోలుకుంటాయి. ఆ తర్వాత వర్కౌట్ చేసినప్పుడు కండరాల సామర్థ్యాన్ని మరింత పెరుగుతుంది. త్వరగా అలసిపోకుండా చూస్తాయి. వర్కౌట్ తర్వాత అరటిపండ్లు తినటం చాలా మంచిది. ఇతరత్రా పండ్లేవైనా తినొచ్చు. ఇవి కణస్థాయిలో జరిగే వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడతాయి. కండరాల్లో గ్లైకోజెన్‌ నిల్వలు పడిపోకుండా చూస్తాయి. వీలైనంత వరకు వ్యాయామాలు చేసిన 45 నిమిషాల్లోపే తినటం మంచిది. ఒకవేళ ఈ సమయంలో తినలేకపోతే.. ఆ తర్వాత 2 గంటల తరువాతే భోజనం చేయటం మంచిది.


ఏ సమయంలో చేయాలి?
ఉదయం పూట కన్నా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువసేపు వర్కౌట్లు చేయటానికి వీలుంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో శరీర ఉష్ణోగ్రత అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో శరీరం అనువుగా ఉంటుంది. ఎక్కువ శ్రమను తట్టుకుంటుంది. అందువల్ల ఈ సమయంలో వ్యాయామం చేయటం మంచిది. ఎక్కువసేపు, మరింత సమర్థంగా వ్యాయామాలు చేయటానికీ వీలుంటుంది. సాధారణంగా రాత్రిపూట వ్యాయామం చేస్తే శరీరంలో స్ట్రెస్ ఎక్కువై నిద్రకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అదే సాయంత్రం వేళల్లో అయితే ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే పడుకోవటానికి కనీసం గంట ముందు వరకు మరీ తీవ్రమైన వ్యాయామాలేవీ చేయకుండా ఉంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: