శరీరంలో అతి ముఖ్యమైన భాగం మెదడు. మెదడు సక్రమంగా పనిచేస్తేనే మన శరీరంలోని అన్ని అవయవాలు తమ పనులను సక్రమంగా నిర్వర్తించ గలవు.మెదడు శరీరంలోనీ వివిధ అవయవాల మధ్య సమాచార మార్పిడికి కేంద్రబిందువుగా ఉంటుంది. సాధారణంగా మెదడుకు సంబంధించిన వ్యాధులు వయసు మళ్ళిన వారికి వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా చిన్న వయసులోనే అల్జీమర్స్‌, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి మెదడు సంబంధిత వ్యాధులతో బాధ పడాల్సి వస్తుంది. ప్రతిరోజు ఈ కింది ఆహార నియమాలను పాటిస్తే  మెదడు సంబంధిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే అటు ఆరోగ్యం ఇటు జ్ఞాపక శక్తి రెండూ సొంతమవుతాయి.పసుపులోని కర్క్యుమిన్‌ అనే పదార్థం అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది

మెదడు చురుగ్గా పని చేయాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా న్యూరోట్రాన్స్మిటర్ గా పని చేసే ఎసిటైల్కోలీన్ చాలా కీలకం. ఇది గుడ్డులో పుష్కలంగా లభిస్తుంది. కావున ప్రతి రోజూ కోడిగుడ్డు ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం.

మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలంటే జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ వంటి గింజలు అధికంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
అంతేకాదు వీటిలోని విటమిన్‌-ఇ శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధిస్తుంది.

వేరుశెనగ కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఇందులోని అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు, ప్రొటీన్లు శరీరానికి తక్షణ శక్తినివ్వడమే కాకుండా మెదడును ఉత్తేజపరుస్తాయి.

బీట్‌రూట్‌ ను ఎక్కువగా తీసుకోవడం రక్త కణాల అభివృద్ధి తో పాటు మెదడుకు సరిపడా రక్తాన్ని సరఫరా చేయడంలో తోడ్పడుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

యాపిల్స్‌పై ఉండే తొక్కలో జ్ఞాపకశక్తిని పెంచే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. కాబట్టి రోజూ యాపిల్స్‌ను తొక్కతో పాటుగా తినడం అలవాటు చేసుకోవాలి

అల్జీమర్స్, పార్కిన్సన్‌ వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో జ్ఞాపకశక్తిని పెంచడంలో గ్రీన్ టీ బాగా సహకరిస్తుంది. ఇందులోని కెఫీన్‌ మెదడును బాగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజూ కనీసం మూడు కప్పుల గ్రీన్‌టీ తాగితే అటు శరీరానికి, ఇటు మెదడు పనితీరుకు చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: