మన భారత దేశంలో ఉసిరిని ఎక్కువగా పచ్చడి రూపంలో తింటుంటాం. ఉసిరి పొడి వినియోగం కూడా ఇటీవల కాలంలో పెరిగింది. ఇక.. ఉసిరిని జ్యూస్‌గా, మురబ్బాగా, సిరప్‌గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను ఊరబెట్టి కూడా తింటారు. రసం తీసి తాగిన, చూర్ణంగా తీసుకున్నా, మురబ్బా చేసుకుని చప్పరించినా, రోట్లో పచ్చడి చేసినా.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. ఈ ఉసిరిని ఎలా తీసుకోవచ్చో... ఏ రూపంలో తీసుకుంటే లాభమేంటో వంటి విషయాలు తెలుసుకుందాం .              

ఉసిరి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ సి స‌మృద్ధిగా ఉండే ఉసిరి కాయలో విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. కాల్షియం లోపంతో బాధపడేవారు, ఐరన్ డెఫీషియన్సీతో రోగాల పాలయ్యేవారు ఉసిరిని తరచూ తీసుకుంటే మంచిది.


ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉండడంతో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది. రక్తహీనతకు చెక్ పెట్టే ఉసిరి.. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. స్థూల కాయంతో బాధపడేవారు తరచూ ఉసిరిని తీసుకుంటే శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఉసిరి పొడిని నీటిలో కలిపి తాగితే గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గించడంలో ఉసిరి చక్కగా పని చేస్తుంది.

రోజూ ఉసిరి తింటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై నల్లని మచ్చలను తొలగించే శక్తి ఉసిరికి ఉంది. ముఖంపై పింపుల్స్ వల్ల ఏర్పడిన స్కార్స్‌పై ఉసిరి రసం అప్లయ్ చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. చుండ్రు సమస్యలతో బాధపడేవారు ఉసిరి పేస్ట్‌ను తలకు పట్టిస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఉసిరి నూనె ఉపయోగిస్తే జట్టు తెల్ల బడటాన్ని తగ్గిస్తుంది. కేశాలకు బలాన్నిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: