సాధారణంగా మనకు నిత్యం అందుబాటులో ఉండే  కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. బెండకాయలను ఆంగ్లంలో లేడీఫింగర్ లేదా ఓక్రా అని కూడా పిలుస్తారు. బెండకాయను ఎక్కువమంది ఫ్రై చేసుకుని తినటానికి ఇష్టపడతారు. అయితే సాంబారు, పచ్చడి,మసాలా కూరలు ఇలా పలురకాల వంటకాల్లో  బెండకాయలను విరివిగా ఉపయోగించవచ్చు. ఇందులో ప్రధానంగా థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, ఏ, సి, ఈ, కె విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బెండకాయను ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీర పెరుగుదలకు అవసరమైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ , ఫైబర్ వంటి పోషక విలువలు సమృద్ధిగా లభించి నిత్యం ఆరోగ్యవంతంగా జీవించడానికి సహాయపడతాయి.బెండకాయలు తింటే
జ్ఞాపకశక్తి పెరుగుతుందని, లెక్కలు బాగా వస్తాయి అని మన పెద్దలు తరచూ అనడం మనం వినే ఉంటాం. బెండకాయలో ఉన్న పోషక విలువలను మన పెద్దలు ఆనాడే గ్రహించారు కాబట్టి ఇలా అన్నారేమో. అయితే బెండకాయ ప్రతి రోజూ ఆహారంగా తీసుకోమని కొందరు వైద్యులు, న్యూట్రీషియన్స్ కూడా సూచించడం జరుగుతుంది. బెండకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయలు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  సహాయపడుతాయి. తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగి బీపి, గుండె జబ్బు వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.

బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.తద్వారా శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహించి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన దీనిని ఆహారంగా తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది దాంతో తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. తద్వారా బరువు తగ్గి ఆరోగ్యవంతంగా జీవించవచ్చు.

బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.

బెండకాయలలో ఉండే విటమిన్ కె, ఎముకలు ఏర్పడటానికి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కాల్షియం శోషణలో కూడా సహాయం చేస్తుంది.

ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బెండకాయను నిత్యం ఏదో రూపంలో ఆహారంగా తీసుకోవడం చాలా అవసరం అన్నది స్పష్టంగా తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: