శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం లేదని.. రోగిని బెడ్ పై బోర్లా పడుకోబెట్టినా.. లేక రోగి ఛాతిని టేబుల్ కి ఆనించినా.. రోగి ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతాయని.. ఈ ప్రక్రియనే ‘అవేక్‌ ప్రోనింగ్‌’ లేదా ‘ప్రోన్‌ వెంటిలేషన్‌’ అంటారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. ‘అవేక్‌ ప్రోనింగ్‌’ లేదా ‘ప్రోన్‌ వెంటిలేషన్‌’ ప్రక్రియ కారణంగా ఆక్సీమీటర్‌ మీద 80 లెవెల్స్ ఉన్న రోగికి ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్న ఈ వైరల్ సోషల్ మీడియా పోస్ట్ లో ఉన్న నిజమెంత? అని ప్రశ్నించగా వైద్యులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. వైద్యులు ఏం చెప్పారో కింద తెలుసుకుందాం.


రోగులు తమ ఆక్సిజన్‌ లెవెల్స్ ఆక్సీమీటర్‌ లో చెక్‌ చేసుకున్నప్పుడు.. ఆ విలువ సాధారణంగా 95 ఉండటం అత్యవసరం. ఒకవేళ 95 అంటే తక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నప్పుడు.. అనగా ఏ తొంభై నాలుగో, లేక తొంభై మూడో ఉన్నప్పుడు ‘అవేక్‌ ప్రోనింగ్‌’ లేదా ‘ప్రోన్‌ వెంటిలేషన్‌’ ప్రక్రియ చేస్తే ఆక్సిజనేషన్‌ కాస్తోకూస్తో పెరుగుతుంది.. కానీ కేవలం బోర్లా పడుకున్నంత మాత్రాన శరీరం లో గణనీయంగా ఆక్సిజనేషన్‌ పెరిగి పోతుంది అని అనుకోవడం అవివేకం అని వైద్యులు చెబుతున్నారు. ఆక్సీమీటర్‌ మీద 80 ఉన్న రోగికి తప్పకుండా ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ పెట్టని ఎడల రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరించారు.



ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌లను నమ్మితే రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని.. ఈ ప్రక్రియ కారణం గా రోగికి ఎటువంటి ప్రయోజనం కలగదని వైద్యులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులను గుడ్డిగా నమ్మకూడదు అని.. నిజానిజాలు గ్రహించాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలను తెలుసుకొని.. వాటిని నిజంగానే ఆచరించి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. అందుకే ఇప్పటికైనా ప్రజలు తప్పుదారి పట్టించే సోషల్ మీడియా పోస్టులతో కాస్త అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: