ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి చుట్టేస్తుంది. దేశ వ్యాప్తంగా రోజుకు లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకూ కేంద్రం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత చర్యలు చేపడుతూ.. కరోనా ప్రోటోకాల్ ను పాటించేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మరో వైపు ప్రతి ఒక్కరికీ కూడా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

అయితే ప్రస్తుతం దేశంలో టీకా కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మరింత జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ మాస్కు, శానిటైజర్ కచ్చితంగా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ప్రస్తుతం నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎవరు కూడా సొంత వైద్యానికి పోరాదని హెచ్చరిస్తున్నారు. జలుబు, జ్వరం, వొళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే సొంత వైద్యం వైపు మొగ్గు చూపకుండా వైద్యులను సంప్రదించి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. 

ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలని హెచ్చరిస్తున్నారు. పేషెంట్‌ హిస్టరీ, స్థితి తదితర అంశాలను ప్రమాణికంగా తీసుకున్న తర్వాతే వారికి అనుగుణంగా మందులు ఇవ్వడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పేషెంట్‌కు షుగర్, బీపీ ఉంటే ఒక రకమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలున్నవారు, ఎలర్జీలున్న వారికి ఒక విధంగా.. సాధారణ స్థితిలో ఉన్న వారికి మరోలా మందులు, డోసులను నిర్ధారిస్తారు. లక్షణాల తీవ్రతకు తగినట్లు స్పందించాల్సిన అవసరం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా ఎక్కువ డోసున్న మాత్రలు వేసుకున్నా, ఏదిపడితే ఆ టాబెట్లు వాడినా  మరిన్ని దుష్ప్రభావాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కనుక వైద్యుడిని సంప్రదించిన తరువాతే మందులు వాడకంపై దృష్టి పెట్టాలని, సొంత వైద్యం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: