క‌రోనా సెకండ్‌వేవ్‌తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు వైర‌స్ వ్యాప్తి పెరుగుతుండ‌టంతో ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన‌ప‌డి ఆస్ప‌త్రుల‌పాల‌వుతుండ‌గా, వేలాది మంది మృత్యువాత ప‌డుతున్నారు. రిక‌వ‌రీల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం కొంత ఊర‌ట క‌లిగించే అంశం. క‌రోనాకుతోడు ఇప్పుడు దేశ ప్ర‌జ‌ల‌ను బ్లాక్ ఫంగ‌స్ (మ్యుక‌ర్ మైకోసిస్) భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ దీని ఆనవాళ్లు వైద్యులు గుర్తించారు. గాంధీ ఆస్ప‌త్రిలో ఇప్ప‌టికే బ్లాక్ ఫంగ‌స్‌తో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురు క‌రోనా రోగుల్లో ఈ వైర‌స్‌ను గుర్తించారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు పేర్కొంటున్నారు. బ్లాక్ ఫంగ‌స్ కొవిడ్ సోకి న‌యం అయిన వారిలోనే అధికంగా వ‌స్తుంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. తొలిద‌శ‌లోనే ల‌క్ష‌ణాల్ని గుర్తించి చికిత్స అందిస్తే న‌య‌మ‌వుతుంద‌ని, ఆల‌స్యం చేస్తే ఫంగ‌స్ మెద‌డుకు పాకి ప్రాణాల‌కు ముప్పుతెస్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

కొవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ వారు, క‌రోనా చికిత్స‌లో స్థిరాయిడ్స్ ఎక్కువ‌గా వాడిన‌వారు, దీర్ఘ‌కాల మ‌ధుమేహ బాధితుల్లో బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని తెలుస్తోంది. త‌ల‌భాగంలో మ‌రీ ముఖ్యంగా చెంప‌ల కిందుగా ముక్కు, చెవులు, క‌ళ్లు, ప‌ళ్లు, ద‌వ‌డ‌ల్లోకి ఫంగ‌స్ విస్త‌రిస్తుంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. అరుదుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంద‌ని, అప్పుడు చాతి నొప్పి, ద‌గ్గు వ‌స్తాయ‌ని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాక ముక్కు దిబ్బ‌డ‌, ఎండిపోయిన‌ట్లుగా ఉండ‌టం, ముక్కులో అసౌక‌ర్యం, దుర‌ద, ముక్కు నుంచి ర‌క్తం, బూడిద‌రంగు, న‌ల్ల‌టి స్రావాలు రావ‌డం జ‌రుగుతుంద‌ని, ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు, మొద్దుబార‌డం, త‌ల‌నొప్పి వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని వైద్యులు సూచిస్తున్నారు.

సాధార‌ణంగా వ్యాధినిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి బ్లాక్ ఫంగ‌స్ సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. ఎయిడ్స్‌, క్యాన్స‌ర్‌, మ‌ధుమేహులు ఈ జాబితాలో ఉంటారు. వీరికి కోవిడ్ సోకిన‌ప్పుడు స్థిరాయిడ్స్ వాడితే ఇమ్యునిటీ మ‌రింత‌గా త‌గ్గిపోతుంది. అప్పుడు బ్లాక్ ఫంగ‌స్ నుంచి మ‌రింత ముప్పు ఎదుర‌వుతుంది. సాధార‌ణ ఇమ్యునిటీ ఉన్న‌వారికి కూడా కోవిడ్ చికిత్స‌లో స్థిరాయిడ్స్ అధికంగా ఇవ్వ‌డం ద్వారా రోగ‌నిరోధ‌క‌శ‌క్తి త‌గ్గిపోయి బ్లాక్ ఫంగ‌స్ సోకే అవ‌కాశం ఉంటుంది. సెకండ్‌వేవ్ స‌మ‌యంలో బ్లాక్ ఫంగ‌స్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ రోగులు న‌యం అయిన త‌రువాత ఫంగ‌స్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే వైద్యులు సూచించిన విధంగా స‌రియైన మోతాదులో స్థిరాయిడ్స్ వాడాల‌ని, ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన త‌రువాత షుగ‌ర్ లెవ‌ల్స్ గురించి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: