కరోనా విజృంభణకు ప్రతి ఒక్కరూ భయం భయంగా బతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ ఆరోగ్య సమస్యలకు సైతం, కొందరి శరీరములో హఠాత్తుగా ఆక్సిజన్ శాతం పడిపోవడంతో కొంతమంది మరణిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుని మెడికల్ షాపుల వారు ఏకంగా పెద్దఎత్తున దందాకు తెరలేపారు. ఆక్సిజన్ లెవెల్స్ ను చూసుకొనే ఆక్సీమీటర్లను, నాసిరకం కు చెందిన వాటిని అమ్మి, సొమ్ము చేసుకుంటున్నారు.


దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కొందరు భయంతో ఒత్తిడికి గురవటం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గుతోంది. దీంతో ప్రతి ఒక్కరు ఆక్సీ మీటర్లను కొనుగోలు చేసి, తమ ఇంటిలోనే తరచూ ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన మెడికల్ షాపుల యజమానులు ఒక్కసారి గా ఆక్సీ మీటర్ ల రేటును రూ.300 నుంచి 1100 రూపాయల వరకు అమ్ముతున్నారు.

అయితే వీటిపై ఎలాంటి తయారు తేదీ, ఎంఆర్పి రేటు వంటివి ముద్రించబడి ఉండవు. దీంతో మెడికల్ షాపు యజమానులు ఇష్టానుసారంగా  అమ్ముతున్నారు. సరే అంత ఖరీదు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ నాణ్యమైన ఆక్సీ మీటర్లను అమ్ముతున్నారా..? అంటే అది లేదు. పనికిరాని అత్యంత తక్కువ ఖరీదు కలిగిన ఆక్సీ మీటర్లను అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ మీటర్లు కొనుగోలు చేయడం వల్లే భయంతో కొందరు ఆసుపత్రి పాలవుతున్నారు. అదెలా అంటే ఆక్సిజన్ మీటర్లు రక్తపోటు  శాతం తెలుసుకోవాలంటే, మొదట ఆక్సీ మీటర్ ను స్విచ్ ఆఫ్ చేసి మరల ఆన్ చేయాలి. అలా ఆన్ చేసిన తర్వాత చూపుడు వేలు అందులో ఉంచాలి. వెంటనే అది మనిషి శరీరంలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని, రక్తపోటును తదితర వివరాలను సూచిస్తుంది.

అయితే బయట దొరికే నాసిరకం ఆక్సీ మీటర్ల వల్ల ఆ మీటర్ ను వేలుకు పెట్టకపోయినా, ఏదైనా వస్తువును పెట్టినా అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ పరికరంలో తమ వివరాలను చెక్ చేసుకుని వ్యక్తులు వెంటనే ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. సరైన పల్స్ రేటును చూపించడం లేదు, నార్మల్ గా ఉన్నప్పటికి పల్స్ రేట్ పడిపోయినట్లు చూపిస్తోంది. ఏలూరు నగరంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి ఆక్సీ మీటర్ ని కొనుగోలు చేసి, దాని ద్వారా ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించుకోగా సాధారణంగా ఉండాల్సిన 95 నుండి పైబడి కాకుండా, 85 శాతం నుండి దిగువ చూపించడం ప్రారంభించింది. అతను వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పరుగులు తీశాడు. తీరా ఆస్పత్రిలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరంతో పల్స్ రేట్ ను పరీక్షించగా అది 95% కంటే ఎక్కువ చూపించగా తన ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇలాంటి నాసిరకం ఆక్సీమీటర్ల ను అమ్మడానికి కారణం ఉన్నతాధికారులు తనిఖీ లేకపోవడమేనని ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: