ఏపీలో కరోనా థర్డ్‌ వేవ్‌ కమ్ముకొస్తుందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి. సంకేతాలు. నిజానికి రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఛాయలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,56,392 మంది కరోనా బారిన పడ్డారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 19,21,371 మంది కోలుకున్నారు. 13,273 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇంతకంటే ఎక్కువగానే కరోనా మరణాలు సంభించి ఉంటాయని అధికారులే ఆఫ్‌ ద రికార్డుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా ఆసుపత్రులలో 21,748 మంది చికిత్స పొందుతున్నారు. అయితే రాష్ట్రంలో నేటికీ కూడా రోజుకు 2 వేల నుంచి ౩ వేల మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. శాంపిల్స్ 80 వేల నుంచి లక్ష వరకు తీస్తున్న సమయంలో ఈ మేరకు కేసులు నమోదు అవుతుండటంతో.. థర్డ్ వేవ్‌కు సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయని వైద్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఆగష్టు రెండో వారం నాటికి అందుబాటులోకి వస్తాయా ఆనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో విశాఖ స్టీల్ ఫ్లాంటుతో కలుపుకుని 240 టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతుండగా, మరో 150 టన్నుల ఉత్పత్తి చేసే ఫ్లాంటును శ్రీ సిటీ వద్ద ఐనాక్స్ కంపెనీ పెడుతుందని, ఈ ఫ్లాంట్ అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక పరిశ్రమలలో కాకుండా ఏరియా ఆసుపత్రులలో పి.ఎస్‌.ఐ ప్లాంట్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 98 ఫ్లాంట్లను ఏర్పాటు చేయాలని భావించగా, ఇందులో 28 ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సాయంతో నెలకొల్పుతున్నారు. ఏరియా ఆసుపత్రులలో ఉండే ఐసీయూలు, బెడ్‌లు అందుబాటులో ఉండేందుకు ఈ ఫ్లాంట్లను నెలకొల్పుతున్నప్పటికీ ఇందులో కేవలం ఆరు ప్లాంట్లు మాత్రమే నేటికీ అందుబాటులోకి వచ్చాయి. కోటి నుంచి కోటిన్నర వ్యయం అయ్యే  ఈ ఫ్లాంట్లు మూడు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఆగష్టు మాసాంతంలోపు ఈ ప్లాంట్లు అందుబాటులోకి రాకపోతే రాష్ట్రంలో మళ్లీ కరోనా ఆక్సిజన్ మరణాలు కళ్ల ముందు కనిపించే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: