కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనా దేశంలోని వూహాన్‌. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ దెబ్బకు అన్ని దేశాలు విలవిల్లాడాయి. ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. అయితే కరోనాను కట్టడి చేయడంలో చైనా చాలా త్వరగానే సక్సెస్‌ అయింది. కానీ ఇప్పుడు ఆ దేశంలో మళ్లీ కరోనా దడ పుట్టిస్తోంది. చాలా ప్రాంతాల్లో పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కఠినమైన లాక్‌డౌన్‌ను విధించారు. నగరాల్లో అధిక సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు చైనా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.  డ్రాగన్  తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫుజియాన్‌ రాష్ట్రంలోని పుతియాన్‌ సిటీ అంతటా పకడ్బందీ చర్యలు చేపట్టారు. అధికారులు. కరోనా హాట్‌స్పాట్‌ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు.

పుతియాన్‌ నగరంలో డెల్టా రకం వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉందన్న ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొత్తగా 50 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జియోమెన్, క్వాన్‌జౌలలోనూ  డెల్టా వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది. దీంతో  ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మరికొన్ని వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతుండటంతో  చైనా అప్రమత్తమైంది.

కరోనా విస్తరణకు ఎక్కువ అవకాశాలున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను అనౌన్స్‌ చేశారు. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు, బార్లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  జియోమెన్‌ నగరం టూరిజం కేంద్రంగా ఉంది. డెల్టా కేసులు బయట పడటంతో అక్కడ కూడా పలు ఆంక్షలు విధించారు. కరోనా బాధితులను కలిసిన వారిని గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టారు.

2019 సంవత్సరం వూహాన్‌ నగరంలో తొలి కరోనా కేసు వెలుగుచూసింది. ఆ త‌ర్వాత ఈ వైర‌స్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఇప్పుడు మ‌రోసారి చైనాలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో  లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. అక్టోబర్‌ 15 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: