నిన్న మొన్నటి దాకా యంత్రాల ద్వారా తయారు చేసిన రిఫైండ్ ఆయిల్ పైనే మోజు ఎక్కువ. వినియోగదారులు కూడా దానినే ఎక్కువగా వినియోగించారు. ఇంకా చెప్పాలంటే... విపరీతంగా వాడేశారు. రకరకాల నూనెలను కలిపేసి మరి వాడేస్తున్నారు. అయితే అలా వినియోగించిన వారే... ఇప్పుడు మెల్ల మెల్లగా ఆనాటి పాత పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. కల్తీ నూనెల వాడకంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు గ్రహించారు. కానీ ఇప్పుడు మళ్లీ గానుగ నూనె వినియోగం పై మనసు పారేసుకుంటున్నారు. గానుగ నూనె వాడకంతో అనేక ప్రయోజనాలను యూ ట్యూబ్ ల ద్వారా చూసి మరీ గానుగ నూనె కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం పోషకాలు కలిగిన ఆహారంతో పాటు పోషకాలు కలిగిన నూనెలు సైతం వాడేందుకు సిద్ధం అవుతున్నారు వినియోగదారులు. ఇందుకోసం మళ్లీ పాతకాలం విధానాల వైపు మళ్లుతున్నారు ప్రజలు.

కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో గానుగ నూనెల దుకాణాలకు జనం క్యూ కడుతున్నారు. గానుగ నూనెల విశిష్టతను తెలుసుకొని మరి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా పాలిష్ బియ్యం కోసం ఆరాటపడిన వారు కూడా ఇప్పుడు కొర్రలు, సజ్జలు, జొన్నలు అంటూ అవే పాత పద్దతులను అనుసరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గానుగ దుకాణం దారులు అన్ని రకాల గానుగ నూనెలు, ఇతర పోషక పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో రిఫైండ్ ఆయిల్ కోసం వందల రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఇప్పుడు తప్పు చేశామని భావిస్తున్నారు. రిఫైండ్ వద్దు... గానుగ ముద్దు అంటున్నారు. అటు గానుగ కేంద్రాల నిర్వాహకులు కూడా తమ దగ్గర అన్ని రకాల గానుగ నూనెలు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే గానుగ నూనె వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం నూనె గానుగలో మూడు కేజీల పల్లీలకు ఒక కేజీ మాత్రమే నూనె  వస్తుంది. కానీ మార్కెట్‌లో మాత్రం కేజీ పల్లి నూనె తక్కువ ధరకే ఎలా సాధ్యమనే ప్రశ్నలు తెలత్తుతున్నాయి. మార్కెట్‌లో దొరికే శనగనూనె కల్తీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. గానుగ నుంచి తీసిన నూనెతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: