ఇది కరోనా కాలం.. కరోనా బారిన పడకుండా తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా ఉంది. నిర్బంధంగా టెస్టులు చేస్తే దేశంలో సగం మందికి కరోనా పాజిటివ్ వస్తుందేమో అన్నట్టుగా కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీకాలే కరోనా నుంచి మన ప్రాణాలు కాపాడే దివ్య ఔషధాలు.. అయితే ఇప్పటి వరకూ ఈ టీకాలు ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రైవేటుగా టీకా డోసులు ఇచ్చినా ఈ రేట్లు సామాన్యుడు భరించే స్థాయిలో లేవు.


ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల వద్ద కరోనా టీకా ధరలు రూ. 1500 వరకూ ఉన్నాయి. ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర సర్వీస్ టాక్స్‌ తో కలిపి రూ.1200 ఉంది. అదే కొవిషీల్డ్‌ అయితే కాస్త చవకే.. దీని ధర రూ.780గా ఉంది. ఇప్పటి వరకూ ఈ టీకాలకు ఉన్నది అత్యవసర అనుమతి మాత్రమే.. గత జనవరిలో ఈ అనుమతి వచ్చింది. అయితే.. ఇప్పుడు తమకు సాధారణ అనుమతి ఇవ్వాలని టీకా సంస్థలు కేంద్రాన్ని కోరాయి. దీనిపై పరిశీలించిన నిపుణుల కమిటీ అందుకు సిఫారసు చేసింది. దీంతో.. ఎప్పుడైనా డీసీజీఐ నుంచి కొవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలకు సాధారణ అనుమతి వచ్చే అవకాశం ఉంది.


సాధారణ అనుమతి వస్తే.. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కరోనా టీకాలను రూ.275 ధర వద్ద అమ్మేందుకు టీకా సంస్థలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఔషధ నియంత్రణ సంస్థ...డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి వచ్చాక ఈ ధరలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ 275తో పాటు సేవా రుసుము అదనంగా రూ. 150 ఉంటుంది. అంటే.. ఒక్క డోసు రూ. 425 అవుతుందన్నమాట. ఎలాగూ టీకాను రెండు డోసులు తీసుకోవాల్సిందే.. అంటే కరోనా టీకా తీసుకోవాలంటే.. రూ. 850 వరకూ వ్యయం చేయాలన్నమాట.


ఇప్పటికే భారత్ బయోటెక్‌, సీరం సంస్థలు ఈ సాధారణ అనుమతి కోరుతూ దరఖాస్తు చేశాయి. డీసీజీఐ అనుమతి ఇస్తే ఇక ఓపెన్‌ మార్కెట్లోకి ఈ టీకాలు వచ్చేస్తాయి. ముందు ముందు టీకాలు తీసుకుంటూ వెళ్లాల్సిందే అన్న విశ్లేషణలు వస్తున్న సమయంలో టీకా కంపెనీలు ఈ మేరకు ధరలు నిర్ణయించే ఆలోచన చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: