తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ ప్రభుత్వం వైఫల్యంతో నిరుపేదల ఉచిత వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మల్లు ఆందోళన వ్యక్తం చేశారు.   ఇండియ హెరాల్డ్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా  ప్రైవేట్‌  హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయే ప్రమాదం నెలకొందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 ఆస్పత్రులు సేవల నిలిపివేతకు సంసిద్ధమైనట్టు తెలుస్తుంది.ఇప్పటికే దాదాపుగా 60 ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ సేవలను ఆపేసినట్టు సమాచారమన్నారు. సంవత్సరన్నరగా  రూ.1500 కోట్ల బకాయిలను ఆసుపత్రులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం  రూ.800 కోట్లే బకాయిలు ఉన్నట్టు చెబుతున్నారని చెప్పారు. ఆగస్టు 10లోగా బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించని పక్షంలో ఆగస్టు 11వ తేదీ నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రులు, 15లోగా చెల్లించని పక్షంలో 16వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రులు ఆయా పథకాల కింద సేవలన్నింటినీ నిలిపివేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రవ్యాప్తంగా 330 ఆస్పత్రులు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రికే ఆరోగ్యశ్రీ కింద రూ.70 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ప్రభుత్వం ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, ప్రతి సారీ ఫలానా సమయానికి బకాయిలు చెల్లిస్తామని చెప్పడమే తప్ప.. విడుదల చేసింది లేదని ఆస్పత్రుల నిర్వాహాకులు ఆరోపిస్తున్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న కొన్ని చిన్న ఆస్పత్రులు మూతపడ్డాయని చెబుతున్నారు. అద్దెలు, వైద్య సిబ్బంది వేతనాలు చెల్లించడం భారంగా మారుతోందని వాపోతున్నారు. బకాయిలు విడుదలపై  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో పలు కార్పొరేట్‌, ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ చికిత్సలను ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్‌ఎస్‌) కింద చికిత్సలను అరకొరగా అందిస్తున్నాయని... ఆ కొద్దిపాటి పరిమిత చికిత్సలకు కూడా ఆటంకం ఏర్పడనుందని వాపోతున్నారు. కాగా, ఈ వారంలోనే రూ.200 కోట్ల వరకు బకాయిలు విడుదలయ్యే అవకాశాలున్నాయని, దశలవారీగా బకాయిలను చెల్లిస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం, ఆసుపత్రులు చికిత్సలు నిలిపివేయడం.. ఈ రెండింటి ఫలితంగా ప్రధానంగా నిరుపేదలు, ఉద్యోగులు, పెన్షనర్స్, జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులను పడాల్సి వస్తోంది. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని, ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ అయ్యేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలతో పాటుగా 108 , 104 సేవలకు అవాంతరం ఏర్పడిందన్నారు. సీఎం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదేయడం వల్లే వైద్య సేవలకు ఈ దుస్థితి ఏర్పడిందని భట్టి అన్నారు. ఈ విషయంలో ప్రజల పక్షాన రాజీలేని పోరాటాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. త్వరలోనే కార్యచరణను ప్రకటిస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: