మలేరియా ఈ సీజన్లో ఎక్కువగా వ్యాపించే వ్యాధి.ఇది ఎక్కువగా ఆడ అనాఫిలిస్‌ అనే దోమ కుట్టినప్పుడు వస్తుంది.ఇక ఈ వ్యాధి 2013లో దాదాపు 20 కోట్ల మందికి సోకితే అందులో దాదాపు 5,84,000 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అందులో దాదాపు 80 శాతం ఐదేళ్ల లోపు పిల్లలే.ఇకపోతే  ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 దేశాల్లో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. దీనివల్ల దాదాపు 320 కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడిస్తున్నారు.ఇక ఈ వ్యాధి లక్షణాలు ఎలా వుంటాయంటే: జ్వరం తీవ్రంగా ఉండటం.చలి పెట్టడం,అంతలోనే చెమటలు పట్టడం,తలనొప్పి,ఒళ్లు నొప్పులు,కడుపులో తిప్పినట్లు ఉండడం, వాంతులు.మొదలైనవి వ్యాధికి కారణమైన దోమలోని రకాన్ని బట్టి,ఈ లక్షణాలు 48-72 గంటల వ్యవధిలో కనిపిస్తుంటాయి.ఇక మలేరియా అనేది ఎలా వస్తుందో తెలుసుకుందాం.



ఆడ అనాఫిలిస్‌ దోమ కాటువల్ల మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవులు మనిషి రక్తంలోకి ప్రవేశించి,రక్తంలో నుండి కాలేయ కణాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందిన తర్వాత కాలేయ కణాలు పగిలినప్పుడు,ఈ సూక్ష్మ జీవులు బయటకు వచ్చి రక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి.అక్కడ మళ్లీ వీటి సంఖ్య వృద్ధి చెందుతుంది. ఇదంతా మలేరియాకు కారణమైన సూక్ష్మజీవి రక్త కణాల్లోకి ప్రవేశించి అవి పగిలిపోయేలా చేస్తుంది.ఆ సమయంలో ఎర్రరక్త కణాలు పగిలినప్పుడు బయటకు వచ్చిన మరిన్ని సూక్ష్మజీవులు ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించడం,అవి పగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది.ఎర్రరక్త కణాలు పగిలిన ప్రతీసారి వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.



మలేరియా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:సాధ్యమైనంత వరకు దోమ తెర ఉపయోగించాలి.దోమతెరకు రంధ్రాలు,చినుగులు లేకుండా చూసుకోవాలి.దోమతెర చుట్టుప్రక్కల ఖాళీల్లో నుండి దోమలు రాకుండా పరుపు కిందకు పూర్తిగా నెట్టాలి.దోమలను చంపడానికి ఇంట్లో దోమల మందు తప్పక వాడాలి.వీలైతే తలుపులు,కిటికీలకు దోమలు రాకుండా ఆపే నెట్‌లు బిగించాలి.. దోమలు వచ్చి నిలవకుండా ఉండేందుకు ఫ్యాన్లు,ఎ.సి.లు ఉపయోగించండి. లేత రంగులో ఉండి,శరీరాన్ని మొత్తం కప్పే బట్టలు వేసుకోండి.దోమలు చెట్లపొదల దగ్గర గుంపులుగా ఉంటాయి.కాబట్టి అలాంటి చోట్లకు వెళ్లకండి.నీళ్లు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోండి,ఎందుకంటే దోమలు అక్కడ గుడ్లుపెడతాయి.ఇక వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి సోకిన 1వ రోజు నుండి 4 వారాల తర్వాతే బయటపడతాయని గుర్తుంచుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: