ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజాతారావు కమిటీ ఇచ్చిన వందకు పైగా సిఫార్సుల్లో చాలా వాటికి ఆమోద ముద్ర  లభించింది. వీటిని దశలవారీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సదుపాయాలు కల్పించడమే కాకుండా వాటిని సమర్థంగా నిర్వహించడంపైనా మంచి విధానాలు తీసుకురావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను ఆధునీకరించాలని  సీఎం జగన్‌ నిర్ణయించారు.



డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్య కార్డుల జారీ ప్రారంభించనున్నట్లు సీఎం చెప్పారు. అదనంగా చేర్చిన 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. సూపర్‌ స్పెషాలిటీ సేవలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని సీఎం నిర్ణయించారు.  ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌లు చేయడకుండా నిషేధం విధించాలని.. వారికి వేతనాలు పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీ సహా పలు కీలక చర్యలకు సీఎం పచ్చజెండా ఊపారు. 




ప్రభుత్వాసుపత్రుల దశ, దిశ మారుస్తామని.. సిబ్బంది కొరత లేకుండా చేస్తామని సీఎం అన్నారు. రోగులు ప్రభుత్వ ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా పడకలు, దిండ్లు, దుప్పట్లు మార్చాలని సూచించారు. బాత్‌రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు పరిశుభ్రంగా ఉండాలని.. అవసరమైన చోట ఏసీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మార్పులు వెంటనే చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల దృక్పథం మారుతుందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: