చైనా సంకల్ప బ‌లం ముందు క‌రోనా వైర‌స్ నాశ‌న‌మ‌వుతోంది. బుధ‌వారం వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ప్రావిన్స్‌లో ఒక్క కేసు కూడా న‌మోదుకాక‌పోవ‌డంతో గ‌మ‌నార్హం. దాదాపు నాలుగు నెల‌లుగా చైనా గ‌జ‌గ‌జ వ‌ణికిపోయింది. వేల కొద్ది కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూ వ‌స్తుండ‌టంతో జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే అక్క‌డి ప్ర‌భుత్వం మాత్రం చాలా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతూ వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో క్ర‌మంగా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు పూర్తిగా కంట్రోల్కు వ‌చ్చిన‌ట్లుగా చైనా ప్ర‌భుత్వం భావిస్తోంది. 

 

చైనాలో నమోదైన సుమారు 81 వేల కరోనా కేసుల్లో అత్య‌ధికంగా కేసులు ఇక్క‌డివే ఉండ‌టం గ‌మ‌నార్హం. అటువంటిది కరోనా వైరస్ ప్రబలినప్పటి నుంచి (దాదాపు  నాలుగు నెల‌లుగా) తొలిసారిగా బుధవారం ఈ ప్రావిన్స్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అంతకు ముందు ఐదు రోజులు స్థానికంగా వెలుగు చూసిన కేసుల కంటే అధికంగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింద‌ని అధికారులు వెల్ల‌డించారు. హుబెయి ప్రావిన్స్‌లో బుధవారం ఒక్క అనుమానిత కేసు కూడా నమోదు కాక‌పోవ‌డం విశేషం. ఐసోలేషన్‌ వార్డుకు తరలించినవారి సంఖ్య శూన్యంగానే ఉన్న‌ట్లుగా అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. 

 

అయితే దేశ వ్యాప్తంగా మాత్రం  బుధవారం ఈ వైరస్ కారణంగా ఎనిమిది బాధితులు మరణించారు. ఇప్పుడు 6,636 మంది కరోనా బాధితులు ఈ ప్రావిన్స్‌లో ఉన్నారు. వారందరూ ఐసోలేషన్ వార్డుల్లో వివిధ ద‌శ‌ల్లో చికిత్స పొందుతున్నారు.చైనాలోని 34 ప్రావిన్స్‌లలో హుబెయి ప్రావిన్స్ ఒకటి. ఈ ప్రావిన్స్‌లోని వుహాన్‌ సిటీలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు 158 దేశాలకు పాకిన ఈ వైరస్ బారిన దాదాపుగా 2.18 లక్షల మంది పడ్డారు. సుమారు 8,800 మంది బలయ్యారు.  చైనా స్ఫూర్తిని, క్ర‌మ‌శిక్ష‌ణ‌ను మిగ‌తా దేశాలు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: