వేసవి కాలం రానే  వచ్చేసింది.. ఎండలు ముదురుతున్న సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.పిల్లలు ఎండ వేడిమిని తట్టుకోవడం కొంచెం కష్టం అయిన పని.  దీనికితోడు ఈ సీజన్లో శరీరం ఎక్కువగా అలసటకు లోనవుతుందని అందుకే పిల్లల ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మిత భోజనంతోపాటు పండ్లు, పాలతో చేసిన పానీయాలు, నీరు తగినంతగా తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు.

 

వేసవి కాలంలో పిల్లల శరీరం పూర్తిగా కప్పే విధంగా దుస్తులు ఉండాలి. కాటన్‌, లైట్‌ వెయిట్‌ ఉన్న దుస్తులు ధరించడం మరీ మంచిది.పిల్లలకు దాహం వేసినా, వేయకపోయినా తరచుగా నీటిని తాగిస్తూ ఉండాలి. ఎండలో ఆడకుండా చూడాలి. తప్పకుండా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు నీడ అందించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పిల్లలు బయటకు రాకుండా చూడడం మంచిది. ఎండల తీవ్రత పెరిగే రోజుల్లో పిల్లలు మాంసాహారం కంటే త్వరగా జీర్ణమయ్యే శాకాహారం తీసుకోవటం ఎంతో మంచిది.

 

అలాగే వేపుడు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ వంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. వాటి స్థానంలో కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌, ఐస్‌ వాటర్‌, ఐస్‌ క్రీమ్‌ల లాంటివి ఇవ్వకుండా పళ్ల రసాలు, జ్యూస్‌లు ఇవ్వడం మంచిది.ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఈ రోజుల్లో పుచ్చకాయ, నారింజ, మామిడి, దోస, పైనాపిల్, ద్రాక్ష వంటి పండ్లు నేరుగా తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత నీరు అందుతుంది. దీనివల్ల పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు. పండ్ల రసాలనూ తీసుకోవచ్చు. నిమ్మరసం, పుదీనా రసం, రాగి జావ, కొబ్బరినీరు వంటివి తీసుకొంటే దాహం తీరటంతో బాటు తగినన్ని పోషకాలూ అందుతాయి. పుచ్చకాయలో 90 శాతం నీటి శాతం ఉండటంతో శరీరానికి తగిన నీటి శాతాన్ని పుచ్చకాయ అందిస్తుంది. కీరదోస ముక్కల్ని కూడా అధికంగా తీసుకోవచ్చు.

 

వేసవిలో నీటిద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి నీటి విషయంలో జాగ్రత్త అవసరం.వీటితో పాటు మజ్జిగ, కొబ్బరినీళ్లు, గ్లూకోజ్‌ నీళ్లు, నిమ్మరసం, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, స్ఫూన్‌ పంచదార కలిపి ఓఆర్‌ఎస్‌ ద్రావణంలా ఇవ్వడం మరీ మంచిది.ఎండాకాలం శరీరంలోని నీరు అంతా బయటకు పోతుంది  దీనివల్ల బాడీ డిహైడ్రేట్ అవుతుంది. అందుకే వీలయినన్ని ద్రవ పదార్దాలు తీసుకోవాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: