చాలామంది తల్లిదండ్రులు డబ్బు అనేది తమకు సంబంధించిన విషయం అనుకుంటారు. పిల్లలకు దాని గురించి తెలియాల్సిన అవసరం లేదనుకుంటారు. దానివల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వారికి తెలియదు. డబ్బు గురించి చెప్పకుండా, డబ్బు విలువ గురించి తెలియజెప్పకుండా పెంచడం వల్ల పిల్ల డబ్బు వ్యవహారాలు తెలియకుండా పోతాయి. లేదంటే వాళ్ల దృష్టిలో డబ్బు లోకువైపోతుంది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం, డబ్బు కోసం తప్పుడు దారులు తొక్కడం కూడా జరుగుతుంది. ఇలాంటివి జరక్కూడదంటే పిల్లలకు డబ్బు గురించి తెలియాలి. మీది మధ్య తరగతి కుటుంబం అయితే కచ్చితంగా తెలిసి తీరాలి. డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కష్టమని కనుక పొదుపు చేయాలని నేర్పించండి. పిల్లవాడి గదిలో ఒక పిగ్గీ బ్యాంక్ ను వుంచండి. వారానికి లేదా నెలకు అతనికి ఇచ్చే డబ్బులో కొంత పొదుపు చేసేలా చూడండి. వానికి పిగ్గీ బ్యాంక్ బోర్ కొట్టేస్తే ఆసక్తి పెంచటానికి మరో బొమ్మను కొని ఇవ్వండి. మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకునేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్ వాల్వ్ చేయండి.

 

దేనికి ఎంత కేటాయిస్తున్నారో, ఎందుకు అంతే కేటాయిస్తున్నారో వాళ్లకు తెలియనివ్వండి. ఇంట్లోకి కావలసిన వస్తువులు, సరుకులు కొనేటప్పుడు పిల్లల్ని వెంట తీసుకెళ్లండి. ఏం కొంటున్నారు, తక్కువలో వచ్చేలా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు వంటివి వాళ్లకి తెలిసేలా చేయండి. అప్పుడప్పుడూ సరుకులు తెమ్మని పిల్లలకే చెప్పండి. ఇచ్చిన డబ్బులో వీలైనంత ఎక్కువ మిగిలిస్తే ప్రైజ్ ఇస్తానని చెప్పండి వేరే వాళ్ల దగ్గరున్న వస్తువుల్ని చూసి పిల్లలు మారాం చేస్తుంటారు. అవి మీరు కొనే పరిస్థితుల్లో లేకపోతే కోప పడకండి. ఎందుకు మీరు కొనలేరన్నది చెప్పండి. మీ బడ్జెట్లో దాన్ని రీప్లేస్ చేసి చూపించండి. అలా చేయకుండా కోప్పడితే వాళ్లలో బాధ, అసంతృప్తితో పాటు దాని మీద ఆశ కూడా మిగిలిపోతుంది.

 

పిల్లలతో అప్పుడప్పుడూ బిల్స్ కట్టించండి. దానివల్ల దేనికెంత అవుతుందో తెలుస్తుంది, వేటినెంత జాగ్రత్తగా వాడాలో తెలుస్తుంది. ఇతరులకు ఇవ్వడం కూడా నేర్పించండి. వాళ్ల చేతులతో లేనివాళ్లకి ఇప్పించండి. నీ దగ్గరున్న దాన్ని ఇతరులకి కూడా పంచాలి అని చెప్పండి. చిన్నపిల్లలకు ఇవన్నీ ఎందుకు అని చాలామంది అనుకుంటారు. కానీ ఏదైనా చిన్నతనంలోనే నేర్పాలి. మనం పడే కష్టం విలువ వాళ్ళకి తెలియాలి. డబ్బు ఎవ్వరికి ఊరికే రాదని తెలియచెప్పాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: