చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని చూస్తుంటారు. ఇక శిశువుకు పెట్టే ఏ ఆహారంలోనూ ఉప్పు కలుపరాదు. ఆహారంలో ఉప్పు జోడించడం వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువగా నీరు తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. పసితనం నుంచే ఉప్పు ఇవ్వడం ప్రారంభిస్తే భవిష్యత్తులో అధిక రక్త పోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఉప్పు బిస్కెట్లు కూడ ఏడాది వయసుకు ముందు ఇవ్వకూడదు.

ఇక శిశువుకు తినిపించే ఆహారంలో చక్కెర, గ్లూకోజ్‌ కూడా కలుపవద్దు. దీనివల్ల ప్రతి ఆహారం తీపిగా తీసుకొనే దురలవాటు మొదలవుతుంది. తీపి పదార్థాలు మితిమీరి తినడం వల్ల, నోట్లో బ్యాక్టీరియా చర్య కారణంగా అవన్నీ ఆమ్లాలుగా మారి దంతాలను నాశనం చేస్తాయి. ఒకసారి మిఠాయిలకు అలవాటు పడితే, మిగతా రుచులపై ఆసక్తి చూపరు.

అయితే చాక్లెట్లు, జెమ్స్‌, పెప్పరమెంట్లు కూడా దంత వినాశనానికి దారి తీస్తాయి. చిన్న పిల్లలకు తిన్న తర్వాత నోరు శుభ్రంగా పుక్కిలించి ఉమ్మేయడం చేతకాదు కాబట్టి, అసలు ఇవ్వక పోవడమే మంచిది. ఒకవేళ, ఎప్పుడో ఒకసారి ఇచ్చినా, తిన్న వెంటనే నీళ్లు తాగిస్తే నోరు శుభ్రపడుతుంది. కాస్త పులుపుగా ఉండే పండ్లరసాలు తాగడానికి ఇష్టపడకపోతే.. వాటిలో కొంచెం నీళ్లు కానీ, పాలు కానీ కలిపి ఇవ్వాలే కానీ గ్లూకోజ్‌, చక్కెర జోలికి వెళ్లకూడదు.

అంతేకాదు.. చిన్న పిల్లలకు మసాలాలు దట్టించిన ఆహారం అస్సలు పెట్టకూడదు. ఆ ఘాటువల్ల కండ్లలో నీరు కారవచ్చు. వాంతి కావచ్చు. ఆ తర్వాత కడుపులో మంట ఏర్పడవచ్చు. నొప్పి, విరేచనాలు కావచ్చు. కాబట్టి, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు, మసాలాలు వేయకముందే పిల్లల కోసం కొంత పక్కన తీసి ఉంచడం ఉత్తమం.

శిశువు జబ్బు పడినప్పుడు,  కొందరు తల్లిదండ్రులు ‘లంఖణం పరమౌషధం’ అన్న సాకుతో జబ్బు పడ్డవారికి ఏ ఆహారం ఇవ్వకుండా కడుపు మాడ్చుతుంటారు. నిజానికి ఆరోగ్యవంతులతో పోలిస్తే, రోగులకే బలవర్ధకమైన ఆహారం అవసరం. వ్యాధి నుంచి కోలుకుంటున్న దశలో ఆకలి బాగా వేస్తుంది. అంతకుముందు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాలి. పిల్లలకు ఆహారం ఇష్టం లేకపోతే తినిపించడం కష్టం కాబట్టి, వారికిష్టమైన ఆహారాన్నే మెత్తగా చేసి కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: