భవిష్యత్ లో చోటు చేసుకోబోయే కొన్ని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని అద్భుతమైన ప్రదేశాలు మన గ్రహం నుంచి అదృశ్యం కాబోతున్నాయి. ప్రస్తుతానికి ఇంకా భూమి మీదే ఉన్న ఈ ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. తరువాత చేద్దామనుకున్నా అవి ఉండవు.
 
గ్రేట్ బారియర్ రీఫ్, ఆస్ట్రేలియా
ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బ 'గ్రేట్ బారియర్ రీఫ్' భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశం ఉందని మీకు తెలుసా? దాదాపు 1500 జాతుల చేపలకు నిలయం ఇది. వాటిలో కొన్ని ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇది దాదాపు 1680 మైళ్ల విస్తీర్ణంలో ఉంది. అయితే పగడపు బ్లీచింగ్, గ్లోబల్ వార్మింగ్ కారణంగా గత 30 ఏళ్లలో రీఫ్ దాదాపు 50 శాతం అంతమైపోయింది. అంచనాల ప్రకారం ఈ గ్రేట్ బారియర్ రీఫ్ 2030 నాటికి కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది.

మడగాస్కర్ ద్వీపం, ఆగ్నేయ ఆఫ్రికా
మడగాస్కర్ వన్యప్రాణి ఔత్సాహికులకు స్వర్గం. ప్రపంచంలోని దాదాపు మూడింట రెండు వంతుల ఊసరవెల్లిలు, మరెన్నో ఉన్నాయి. మడగాస్కర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన ముప్పు అటవీ నిర్మూలన. ఈ ద్వీపంలో ఉన్న చెట్లు ఇప్పటికే 90 శాతం తుడిచి పెట్టుకుపోయాయి. రాబోయే 35 ఏళ్లలో మనం మడగాస్కర్ ద్వీపాన్ని కోల్పోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

డెడ్ సీ, జోర్డాన్ మరియు ఇజ్రాయెల్ సరిహద్దు
అధిక ఉప్పు స్థాయిలకు ప్రసిద్ధి చెందిన డెడ్ సీ ఇప్పుడు చనిపోతోంది. ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటైన డెడ్ సీ విపత్తుకు భౌగోళిక, మానవ కారకాలే రీజన్. ఇక్కడ ప్రతి సంవత్సరం నీటి మట్టం 3 అడుగుల చొప్పున తగ్గిపోతోంది.

గాలాపాగోస్ దీవులు, ఈక్వెడార్
ఇక్కడ ఫ్లైట్ లెస్ కార్మోరెంట్స్ నుండి జెయింట్ తాబేళ్ల వరకు అనేక రకాల వృక్షజాలం, జంతుజాలానికి నిలయం. కానీ ఈ ద్వీపాలు కూడా తమ ఉనికి కోసం పోరాడుతున్నాయి. క్రూయిజ్ ప్రయాణీకులు, నాలుగు బిజీ విమానాశ్రయాలు, పెరుగుతున్న జనాభా కారణంగా  గాలాపాగోస్ ఇక కనిపించకపోవచ్చు.

మాల్దీవులు
అందమైన బీచ్‌లు, మనోహరమైన రిసార్ట్‌లు... ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అయితే 21 వ శతాబ్దం చివరి నాటికి సముద్ర మట్టాలు ప్రస్తుత స్థాయిలో పెరుగుతూ ఉంటే మాల్దీవులు తుడిచి పెట్టుకు పోవచ్చు.

వెనిస్, ఇటలీ
సముద్ర మట్టం పెరుగుతున్నందున ఈ మధ్యయుగ పట్టణం కూడా ప్రమాదంలో ఉంది. వెనిస్ ను నీటి మీద నిర్మించారు. సముద్ర మట్టంలో కేవలం 3.3 అడుగులు పెరిగిందంటే వెనిస్ నీట మునుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: