బతుకమ్మ పాటల్లో సంస్కృతిని, సంప్రదాయ రీతిని చాటిచెబుతూ సినీ గేయ కవి మౌనశ్రీ మల్లిక్ రాసిన గేయం ఎంద‌రో మ‌న్న‌న‌లు అందుకుంది. భౌగోళిక సరిహద్దులు దాటి ప్రతి ఒక్కరికీ ఎంతగానో చేరువవుతోంది. భారతీయం అనే ఆధ్యాత్మిక సంస్థ రూపొందించిన ఈ పాట ఉత్తమ సాహిత్యానికో వెలుగు బాట చూపుతోంది. ఈ పండుగ వేళ తెలుగు జాతి సంతోషాలను రెట్టింపు చేసేందుకు మ‌రోసారి సిద్ధం అవుతోంది. జనం నుంచి వనంలోకి వచ్చి జాగృతిపరుస్తూ బతుకమ్మ నడయాడిన రీతిని మౌనశ్రీ అక్షరీకరించిన తీరు నభూతో.. పల్లె జీవనానికో ప్రతినిధిగా, ప్రకృతి ఆరాధన వెనుక ఉన్న వైశిష్ట్యాన్ని మరింత ఉన్నతీకరించింది.  

"రంగురంగుపూవులతో కనిపించే బతుకమ్మ తేనెకళ్ల నవ్వల్లే మెరిసిందమ్మ
జానుతెలుగు పాటలతో కరుణించే బతుకమ్మ
వానవిల్లు శోభల్లే వెలిగిందమ్మా.. "


భారతీయం కానిదేది.. అది బతుకమ్మైనా.. గై(గౌ)రమ్మైనా.. మన సంస్కృతిలో మమేకం కానిది ఏముందని? వికసించే ఆ.. సోయ గం .. ప్రకృతి సిద్ధం.. పరిమళించే పాట సాహిత్యం మనందరి సొంతం. ఔను! ఉత్తమోత్తమంగా వినిపించే పాటకు ప్రాంతంతో పనే ముంది? పల్లవించే తెలుగుదనానికి నీ / నా అన్న భావన ఎక్కడని? బతుకమ్మ తెలుగుజాతి సొత్తు. రండి పదిలపరుచుకుందాం. బతుకమ్మ మనందరి ఆడపడుచు. రండి గౌరవిద్దాం. ఈ పండుగ వేళ అమ్మకు జోతలిడుదాం. ఆశ్వయుజ మాసాన మదిని పల కరిస్తోన్న ఈ గీతాన్ని విందాం. పాట రచయిత మౌనశ్రీ మల్లిక్ (స్వస్థలం : వరంగల్ జిల్లా, వర్థనపేట)ను అభినందిద్దాం. ఇన్నాళ్ల మల్లిక్ మౌనం శబ్దించడం అంటే కొమ్మారెమ్మలను, ఆడబిడ్డలను ఆనందింపజేయడం. పల్లె జీవనాన్ని ఓలలాడించడం. ఇంకా..చె ప్పాలంటే ఆ.. మౌనమే పాట రూపంలో.. పల్లవించింది.. పరిమళించింది..తెలంగాణ సంస్కృతిని ప్రస్తుతించింది.

 
"పుట్టింది బతుకమ్మ తెలంగాణ కడుపులో..
పెరిగింది బతుకమ్మ తెలంగాణ మమతలో..
కొండాకోనల్లోనా తంగేడు పూలతో
ఎండావానల్లోనా మెరిసేటి నవ్వుతో
బంగారు బతుకమ్మ పల్లె గడప దాటింది"


 ఎవరీ బతుకమ్మ. ఎక్కడిదీ పలుకమ్మ.. ఎవ్వరిదీ కూనలమ్మ. ఏమంటన్నాడా కవి "పూచే పూలే పూజలైనవి.. దేవీ నవ్వులైనవి.. పాడే పాటలే ఆశలైనవి.. దేవీ దీవెనైనవి" అంటూ పరిణామ గతిని వివరిస్తున్నాడు. వహ్! పల్లె గడప దాటి వస్తోందిగో సంబరం. దీవిస్తోందిగో అంబరం. స్వాగతించగరా.. విశ్వఖ్యాతి దక్కించుకుందీ వైభవం..పల్లవించగరా.. ప్రతి కొండా కోనా పరవశించు సమయాన సకల జనావళికి శుభప్రదం ఈ క్షణం. ఏ వేడుకైనా సమూహ క్షేమం ఆనందమేగా కోరుకుంటుంది? అందుకే ఈ వేళ ప్రాంతాల‌క‌తీతంగామంచి పాట విన్న ప్ర‌తిసారీ  నేల  పులకిస్తోంది. బతుకమ్మ పాట ప్రాభవం రెట్టింపైందని.. పండుగ ప్రాశస్త్యం ప్రాంతాలకతీతంగా వెలుగొందుతోందని..  ఆశిస్తోంది వృత్తి  జీవులకు మరిన్ని మంచి రోజులు రానున్నాయని.. సమాదరిస్తోంది ఓ గొప్ప వేడుక వైభవాన్ని. కీర్తిస్తోంది మౌనశ్రీ సాహిత్య ఔన్నత్యాన్ని.. ఔను! ప్రేమాదరాలు పంచే సమయాన ప్రతి తల్లీ బతుకమ్మే. అందుకే అనండి ఇప్పుడు ఆ.. అమ్మకు జేజే అని.. తోటి మనిషి ఆదరాన్ని పొందుతూ.. ఆనందాన్ని పంచుతూ ఎదిగిపోండి.

 
"అడవీ బిడ్డలూ ఆరాధించగా..
చల్లని చూపులే చూసిందమ్మా..
పల్లె ప్రజలంతా పూజలు చేయగా
పచ్చని పంటలే పండాయమ్మ
బహుజన బతుకమ్మ పట్టణాలు చేరెనమ్మ
నింగినేల మురిపించి పూలవాన కురిసెనమ్మ
వాగువంకలోకి జారి ఎరువు చెలకలోన ఇంకె "



పైరు పచ్చందనాలు అందుకుంటేనే కళ. అది ప్రకృతికి కళ. మనిషి సంస్కృతీ శోభను అందిపుంచుకుంటేనే కళ. ఇది జీవితానికో కళ. ఇందులో మార్మికతకు చోటెక్కడని? ఉన్నదంతా ధార్మికతే.. వెల్లివిరిసేదంతా ఆధ్మాత్మికతే. అందుకే ఏ కళకైనా ఏ కథకైనా జీవితరంగమే వేదిక. జీవితాన్ని విడువడి మనిషి, ప్రకృతిని విడువడి జాతి ఉంటే అది బతుకెట్టా అవుతది! గైరమ్మైనా.. బతుక మ్మైనా ఆరాధించమనేది ప్రకృతిని.. ఉద్భోదించేది సమూహం అంతా కలిసిమెలిసి ఉండమని.. ఇంతకుమించి ఏ దేవీ అయినా దేవర అయినా ఏం ఆదేశిస్తారని? మనిషి నుంచి.. ఏం ఆశిస్తారని? వాన చినుకులు ఒడిసిపట్టకుంటే బతుకెట్టా..? వాగూ వంకా పొంగిపొరలుకుంటే పంట సిరులు దక్కేదెట్టా? మాగాణి నవ్వేదెట్టా?  




"నగరా పౌరులు ప్రార్థన చేయగా
నజరానాలనే ఒసగిందమ్మా
కోట్ల ప్రజలంతా కోరీనంతనే
సొంత రాష్ట్రమే ఇచ్చిందమ్మా
మా తల్లి బతుకమ్మ దేశమంత ఆడెనమ్మ
కులమత భేదాలు రూపుమాపి మురిసెనమ్మ
సరిహద్దులన్ని దాటి విశ్వమంత విస్తరించె
ప్రకృతమ్మ ఆవహించి శక్తి రూపమై నిలిచె"
 


"వనం నుంచి జనంలోకి వచ్చిన బతుకమ్మ పరిణామ క్రమానికి ప్రతీక ఈ పాట. ఆధునిక గీతానికి ప్రతినిధి  ఈ పాట. తెలంగాణ పల్లెల్లో శోభిల్లే సంస్కృతికి పట్టం కడుతూ..శ్రమైక జీవన సౌందర్యానికి అర్థం చెబుతూ.. ప్రకృతి ఆరాధన వెనక దాగి ఉన్న పరమా ర్థాన్ని వివరిస్తూ అతి తక్కువ సమయంలో రాసిన పాట ఇది. నా గురువులందెరో బతుకమ్మకు అక్షర నీరాజనాలిచ్చారు. నా వంతుగా భారతీయం అనే ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు రామ్ చందర్ కోరిక మేరకు రాసిన పాట ఇది" అని వివరించారు మౌనశ్రీ. 


సంస్కృతి అయినా సంప్రదాయమైనా వర్థిల్లేది ఆదరణకు నోచుకుంటేనే! ప్రభువులకు పట్టకుంటే అది కనుమరుగు కాదు తెరమరుగు కాక తప్పదు. గడిచిన కాలంలో దేశ, విదేశాలలోనూ ఈ పండుగను ప్రాచూర్యంలోకి తీసుకువచ్చింది ఎందరో? దీని వైశిష్ట్యం చాటింది ఎందరో? ఇందులో పాట మమేక మైంది. కాదు అక్షరాల అదే అగ్రతాంబూలం అందుకుంది. కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచింది.
- రత్నకిశోర్ శంభుమహంతి



మరింత సమాచారం తెలుసుకోండి: