గ్రామాలు అంటే దేశానికి వెన్నెముక అన్నారు. కానీ నేడు ఆ గ్రామాలంటే చాలా మందికి చిన్న చూపు, అక్కడ సరిగ్గా విద్యుత్ సరఫరా ఉండదు, కనీస రోడ్డు మార్గాలు ఉండవు, ఇంకా ఎన్నో లోపాలు ఉంటాయని అక్కడ ఈ తరం ఎవరు ఉండటానికి ఇష్టపడరు. కానీ కరోనా తరువాత ఈ అభిప్రాయం  కాస్త మార్పు చెందిందని అనుకుంటున్నాం. నిజంగా ఎక్కడ ఎవరు ఏది సాధించినా వారి నేపథ్యం మొత్తం కేవలం పల్లెలు మాత్రమే. అక్కడే ఏదో సాధించాలని, ఏదో చేయాలనే సంకల్పం మనసులో బయలుదేరేట్టుగా పరిస్థితులు ఉంటాయి. అన్ని సౌకర్యాలు అమర్చిన  నగరాలలో నేరాలు తప్ప ఏమీ ఉండటం లేదు.

అలాంటి గ్రామాలలో కూడా కొన్ని చోట్ల స్థిరమైన అద్భుతాలు నెలకొంటున్నాయి. గ్రామాలు అంటే నిరుద్యోగం, నిరక్షరాస్యతను పరాకాష్ట అనేవారికి మేము అలా కాదు అని గొంతెత్తి చెప్పగల గ్రామాలూ   దేశంలో ఉన్నాయి. అలాంటి ఒక గ్రామం గురించి కాస్త తెలుసుకుందాం. ఈ గ్రామంలో ఉద్యోగాలకు పెట్టింది పేరు. ఈ ఒక్క గ్రామంలోనే వందమందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. ఇంకా అనేకమంది ప్రైవేట్  చేస్తున్నారు. ఆ జిల్లాలోనే ఎక్కడో మారుమూల ఈ గ్రామం ఉంటుంది. అదే వైఎస్ఆర్ జిల్లా లోని సంబేపల్లి మండలం పరిధిలో ఉన్న 'పెద్దబిడికి'. వంద ఏళ్ళ క్రితమే ఏర్పడిన ఈ గ్రామం బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు.

తాజా లెక్కల ప్రకారం పెద్దబిడికి లో 640 మంది ఓటర్లు, 345కుటుంబాలు, 892 జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్నా సన్నకారు రైతులే. అందుకే తల్లిదండ్రులు కనీసం తరువాత తరం అయినా చక్కగా ఉండాలని, బాగా చదివించారు. దీనితో ఈ గ్రామంలో వందకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 80 మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరు పనిరీత్యా వేర్వేరు ప్రాంతాలలో ఉండాల్సి వచ్చినా పుట్టిన ఊరిని మరిచిపోకుంగా వారి కి తోచినంత గ్రామాభివృద్ధికి, అలాగే తరువాతి తరం విద్యాభివృద్ధికి సాయం చేస్తున్నారు. ఊరిలో ఎవరిని కదిలించినా తమ పెద్దల కష్టంతోనే తమ విజయం సాధ్యం అయ్యిందని చెపుతారు. ఇక్కడి ఉద్యోగస్తులందరు గ్రామానికి ఏ అవసరం వచ్చినా ముందుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: